గజ్వేల్ నుంచి పోటీ అందుకే: కేసీఆర్‌పై ఈటల రాజేందర్ సంచలన విమర్శలు
మెదక్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ తోపాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender).. గురువారం గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ (Gajwel) తనకు కొత్త కాదని.. ఇక్కడి ప్రజలతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందన్నారు ఈటల. పార్టీ కోసం పని చేసిన తనని మెడ పట్టి బయటకు గెంటారని ఈటల రాజేందర్ విమర్శించారు.
తన నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు ఈటల. కేసీఆర్ మొఖం మీద తాను గెలవలేదని.. తన మొఖాన్ని చూసి ప్రజలు గెలిపించారని వ్యాఖ్యానించారు. ప్రచార సమయంలో తాను ఏ ఊళ్లో నిద్రపోతే అక్కడ కరెంటు పోయేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చిన్న పోరగాళ్లు మద్యానికి బానిసవుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.

గజ్వేల్‌లో తొలి పౌల్ట్రీఫాం ఏర్పాటు చేసి తన జీవితం ప్రారంభించానని ఈటల తెలిపారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో ఇక్కడే ఎక్కువగా తిరిగేవాడిని చెప్పారు ఈటల. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసని ఈటల పేర్కొన్నారు. ఎమ్మెల్యేను అయ్యాక తెలంగాణతో పాటు అణగారినవర్గాల వారి కోసం కూడా పోరాడానని ఈటల తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మున్సిపల్ కార్మికులు తొలిసారి ఆందోళనలు చేశారన్నారు. ఒక్క సంతకంతో మున్సిపల్ కార్మికులను సీఎం కేసీఆర్ తొలగించారని ఈటల ధ్వజమెత్తారు. ఉద్యమాలు, పోరాటాలకు పేరొందిన తెలంగాణలో అవి కనపడకుండా చేయాలని చూశారని ఈటల మండిపడ్డారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ అవమానించారని ఈటల ఆరోపించారు.
ఇప్పుడు ఓట్లకోసం ఆర్టీసీ కార్మకులను ప్రభుత్వ ఉద్వోగుల్లా గుర్తించారని విమర్శించారు ఈటల. తాను ఎమ్మెల్యేగా గెలవాలని ఇక్కడకి రాలేదని.. హుజురాబాద్‌లో తన గెలుపు ఆపలేరని ఈటల ధీమా వ్యక్తం చేశారు. 5,800 మంది దళితుల భూములను కేసీఆర్ దోచుకున్నరన్నారని ఆరోపించారు. తనను హేళన చేసినందుకే గజ్వేల్‌కి వచ్చి కేసీఆర్‌పై పోటీకి దిగానని స్పష్టం చేశారు ఈటల.
గజ్వేల్‌కి ఏమిస్తానో తెలియదు కానీ, ఇక్కడ పార్టీ క్యాడర్ పెరిగిందన్నారు ఈటల. తాను కేసీఆర్‌తో డబ్బులు కోసం కొట్లాడను.. ఆత్మవిశ్వాసంతో కొట్లాడతాను. గజ్వేల్ ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేశారు ఈటల. తాము అధికారంలోకి వస్తే పండిన ప్రతి గింజ కొంటామని.. నిరుద్యోగ యువతకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటులో కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామని ఈటల భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఏ వ్యక్తి చనిపోయిన ఐదు లక్షల బీమా ఇస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. గజ్వేల్ ప్రజలు బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. కాగా, వర్గల్ సరస్వతీ దేవీ ఆలయాన్ని సందర్శించిన ఈటల.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గజ్వేల్ నియోజకవర్గం : వర్గల్ లోని సరస్వతీ దేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
— Eatala Rajender (@Eatala_Rajender) October 26, 2023
బీజేపీ గజ్వేల్ అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత మొదటిసారిగా గజ్వేల్ లో అడుగుపెడుతున్నా.
గజ్వేల్ ముఖద్వారం అయిన వంటిమామిడిలో ఘన స్వాగతం పలికిన నాయకులకు, కార్యకర్తలకు… pic.twitter.com/FVZbM3y96u
మరోవైపు, ఈటలతోపాటు వర్గల్ లో పర్యటించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ను సాగనంపాల్సిన సమయం వచ్చిందని దుబ్బాక అన్నారు. తెలంగాణ సమాజం ఆకలినైనా భరిస్తుంది కానీ.. ఆత్మాభిమానం చంపుకోదన్నారు. ఎన్నికల ముందు పైసలు పంచి ఓట్లు వేయించుకునేందుకు పైసల మంత్రి వస్తారని విమర్శించారు. తెలంగాణలో మద్యం ద్వారా రూ.50 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. మద్యం ద్వారా ప్రజల డబ్బు, ఆరోగ్యం దోచుకుని పింఛన్లుగా ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీకి పట్టం కట్టాలన్నారు.












Click it and Unblock the Notifications