వరంగల్ తూర్పుపై ఈటల రాజేందర్ ఫోకస్; ఎమ్మెల్యే నన్నపునేనికి టెన్షన్; దీనివెనుక పెద్ద కథే!!
వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ఈటల రాజేందర్ ఫోకస్ పెట్టరా? వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పున కాషాయ జెండా ఎగురవేసే వ్యూహంతో ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారా? సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ని ఓడించి తీరాలన్న కసితో ఈటల రాజేందర్ వరంగల్ తూర్పుపై దృష్టి సారించారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

వరంగల్ తూర్పుపై ఈటల రాజేందర్ నజర్; టార్గెట్ నన్నపునేని నరేందర్
బిజెపి ఎమ్మెల్యే, బిజెపి చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం పై ఫోకస్ పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను ఓడించి తీరాలన్న కసితో ఆయన వరంగల్ తూర్పులో రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావును బిజెపిలోకి తీసుకువచ్చారు.
అంతేకాదు పలువురు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా ఈటల రాజేందర్ కు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్ వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడానికి గల కారణం ఏమిటి అన్నదానిపై వరంగల్ జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

వరంగల్ తూర్పుపై ఈటల దృష్టి సారించటానికి కారణం ఇదే
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగిన సమయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటల రాజేందర్ ను ఓడించి తీరాలని పెద్ద ఎత్తున హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం చేశారు. ఆసమయంలో ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో రాజకీయం చేసిన నేతలకు చెక్ పెడతానని చెప్పారు. ఈ క్రమంలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ప్రత్యేకమైన దృష్టి సారించారని నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్ లో బలమైన నాయకులపై ఈటల వేట
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన సమయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఈటల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనాడు ఉప ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న హరీష్ రావు మన్ననలు పొందడం కోసం ఆయనకు అవసరం లేకున్నా ఈటల రాజేందర్ ను బలంగా టార్గెట్ చేశారు. దీంతో తనను ఓడించడం కోసం తనపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన వారిని టార్గెట్ చేసిన ఈటల రాజేందర్ ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆనాడే తేల్చి చెప్పారు. ఈక్రమంలోనే నియోజకవర్గంలో పావులు కదుపుతూ నియోజకవర్గంలో బలమైన ద్వితీయ స్థాయి నాయకులను బీజేపీ బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈటలతో టీఆర్ఎస్ కార్పోరేటర్ల రహస్య సమావేశం.. నన్నపునేనికి టెన్షన్
ఇటీవల కాలంలో ఈటల రాజేందర్ తో కొందరు టిఆర్ఎస్ కార్పొరేటర్లు రహస్య సమావేశంలో పాల్గొన్నట్టుగా కూడా నియోజక వర్గంలో టాక్ వినిపిస్తోంది. దీంతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు టెన్షన్ మొదలైంది. పార్టీని వీడి నేతలెవరూ వెళ్లకుండా నన్నపనేని నరేందర్ దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో నన్నపనేని నరేందర్ ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసి ఉండకపోతే, ఇప్పుడు నన్నపునేని నరేందర్ కు ఈ కష్టాలు వచ్చి ఉండేవి కాదని నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి ముందు ముందు వరంగల్ తూర్పు రాజకీయాల్లో ఈటల మార్క్ ఏవిధంగా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications