ఒక్క రూ.2 వేల నోటు దొరకట్లేదు, వారి వద్ద వేల కోట్లా: ఈటెల ఆశ్చర్యం
తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.17,500 కోట్ల కరెన్సీ వచ్చిందని, మరో రూ.20 వేల కోట్లు రావాల్సి ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నాడు చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.17,500 కోట్ల కరెన్సీ వచ్చిందని, మరో రూ.20 వేల కోట్లు రావాల్సి ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం నాడు చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన కరెన్సీలో 96 శాతం రూ.2వేల నోట్లు ఉన్నాయని, మరో రూ.5వేల కోట్ల చిల్లర వస్తేనే ఇబ్బందులు పోతాయన్నారు. ఈటెల ఆర్బీఐ అధికారులతో భేటీ అయ్యారు.
ఈ రోజు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, సీఎస్ ప్రదీప్ చంద్రతో కలిసి ఆర్బీఐ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజు వరకు ఆర్బీఐ నుంచి రూ.17,500 కోట్లు వచ్చాయన్నారు.
లెక్క ప్రకారం రూ.20 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి ఐదువేల వేల కోట్ల చిన్న నోట్లు ఇస్తేనే ప్రస్తుత ఇబ్బంది నుంచి బయటపడుతామన్నారు. తెలంగాణలో 83.37 కోట్ల కుటుంబాలకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నారు.

అందులో ఎన్ని అక్టివ్‌గా ఉన్నాయో, ఎన్ని ఇన్‌అక్టివ్‌గా ఉన్నాయో తెలియాల్సి ఉందన్నారు. ఇంకా ఇరవై లక్షలకు పైగా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు లేవన్నారు. పేద ప్రజలు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇక్కడ పేద వారికి రూ.2వేల నోటు ఒక్కటి దొరకడం లేదని, కానీ కొంతమంది దగ్గర వేల కోట్ల కొత్త నోట్లు దొరుకుతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు కుమ్మక్కు కావడమే ఈ దుస్థితికి కారణమన్నారు. తప్పు చేస్తున్న బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
లెక్కలు రిపోర్ట్ ఆధారంగా కాకుండా గ్రౌండ్ రియాల్టీ ఆధారంగా జరగాలన్నారు. క్యాష్‌లెష్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సిద్దిపేటను మోడల్ క్యాష్ లెష్‌గా తయారు చేస్తున్నామన్నారు. ప్రజలకు డిజిటల్ లావాదేవీలును సులభతరం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నోట్ల రద్దు కాలంలో మరికొంతమంది బ్యాంకు అకౌంట్ తీసుకున్నారని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications