నయీం చెలరేగిపోవడానికి పోలీసు శాఖ వైఫల్యమే కారణం: మాజీ పోలీసు అధికారి
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు విచారణలో భాగంగా మాజీ డీజీపీతో నయీంకు ఉన్న సంబంధాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నయీం దందా కేసు పోలీసు వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో నయీం కేసుపై మాజీ పోలీసు అధికారి డీటీ నాయక్ మీడియాతో మాట్లాడారు.
గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్ నయీంను పోలీసు శాఖ పెంచి పోషిస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నయీం మాజీ నక్సలైట్ స్థాయి నుంచి గ్యాంస్ స్టర్‌గా ఎదగడంలో పోలీసుల మౌనం అభ్యంతరకరమని ఆయన వ్యాఖ్యానించారు.
పోలీసు శాఖ క్రిమినల్స్ మద్దతిస్తే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదన్నారు. నక్సల్స్‌కు వ్యతిరేకంగా నయీంను వాడుకున్న మాట వాస్తమేనని ఆయన అన్నారు. నయీం ఎవరో తనకు తెలియదని, నయీంను తాను కనీసం చూడలేదని అన్నారు. వ్యాస్ ఘటనతో నయీం ఎవరో తెలిసిందని చెప్పుకొచ్చారు.
నయీం ఒక దళం సభ్యుడని విన్నానని, నక్సలైట్ల ఏరివేతి విషయంలో సమచారం ఉందంటే ప్రతి ఒక్కరినీ వినియోగించుకుంటామని ఆయన చెప్పారు. సమాచారం ఇచ్చారు కదా అని నేరాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం సరైన విధానం కాదని ఆయన తెలిపారు.
కోవర్టు నుంచి గ్యాంగ్‌స్టర్‌గా నయీం చెలరేగిపోవడానికి పోలీసు శాఖ వైఫల్యమే కారణమని ఆయన చెప్పారు. నయీం ఎన్‌కౌంటర్‌ను రాజకీయంగా నడిపారని ఆయన అన్నారు. తాను నార్త్ తెలంగాణలో పని చేశానని ఆయన చెప్పారు. తాను పనిచేసిన ప్రాంతంలో నయీం వంటి వారి పాత్రలేదని, తనకు గ్యాంగ్ స్టర్స్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన అన్నారు.
సిద్ధాంతపరంగా నక్సలిజం వైపు ఆకర్షితులైన వారిపై తమ గురి ఉండేదని, ఇలాంటి సెటిల్ మెంట్లు చేసేవారు తనకు ఎప్పుడూ ఎదురుపడలేదని ఆయన పేర్కొన్నారు. నయీం ప్రధాన అనుచరుడు తాజుద్దీన్‌ను గురువారం పోలీసులు రాజేంద్రనగర్ 23వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు అతడికి 14 రోజుల కస్టడీ విధించింది. అనంతరం అతడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. తాజుద్దీన్ 2012 నుంచి నయీం వద్ద పనిచేస్తున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కూతురు పెళ్లి చేసి తాజుద్దీన్ అప్పులపాలయ్యాడని తెలిపారు. రూ.30 వేలకు తాజుద్దీన్ గోవాలో నయీం వద్ద పనికి కుదిరాడని వివరించారు.
తాజుద్దీన్ నల్లగొండ జిల్లా కనగల్ నివాసి. అల్కాపురిలోని నయీం బెడ్‌రూంలో జరిపిన తనిఖీల తరువాత స్వాధీనం చేసుకున్న స్వాధీనం చేసుకున్న రూ. 2.08 కోట్ల నగదును రాజేంద్రనగర్ న్యాయస్థానంలో పోలీసులు డిపాజిట్ చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ వర్సిటీలోని ఎస్‌బీహెచ్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు నార్సింగ్ పోలీసులు తెలిపారు. కాగా, నయీమ్ నివాసంలో భారీ ఎత్తున నగదు, పత్రాలు, నగలు, ఖరీదైన వస్తువులు లభ్యమైన సంగతి తెలిసిందే.

నయీం కేసుని సీబీఐకి అప్పగించాలి: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి
నయీం కేసుని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. నయీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాండ్ డాక్యుమెంట్లను కోర్టు ఆధీనంలో ఉంచి విచారణ జరపాలని ఆయన సూచించారు. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు అనుమానిత పోలీసులను విధులకు దూరంగా ఉంచాలని అన్నారు.












Click it and Unblock the Notifications