బీజేపీకి వివేక్ రాజీనామా - కాంగ్రెస్ లోకి ఎంట్రీ , సీటు ఖరారు..!!
తెలంగాణ బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గతంలో బీజేపీలో చేరిన నేతలు తిరిగి ఒక్కొక్కరుగా సొంత గూటికి చేరుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు వివేక్ వెంకట స్వామి బీజేపీకి రాజీనామా చేసారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వివేక్ కు కాంగ్రెస్ సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీకి వరుస షాక్ లు : తెలంగాణ బీజేపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ నేతలను తిరిగి సొంత గూటికి రప్పించటంలో పార్టీ వ్యూహాలు ఫలిస్తున్నాయి. బీఆర్ఎస్ తో ప్రధాన పోటీగా భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల నేతలను తిరిగి పార్టీలో చేర్చుకొనేందుకు కొనసాగిస్తున్న మంతనాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ను వీడి కొంత కాలం పలువురు నేతలు వరుసగా బీజేపీలో చేరారు.

అయితే, బీజేపీలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ నేతలకు రుచించటం లేదు. ఇదే సమయంలో ఎన్నికల పోరు ప్రధానంగా బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ గా మారటంతో నేతల ఆలోచనలు మారుతున్నాయి. కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ..అధికారంలోకి వస్తుందనే ప్రచారం నేతల వలసలకు కారణమవుతున్నాయి. అందులో భాగంగా మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..ఇప్పుడు అదే బాటలో వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ లో చేరుతున్నారు.
కాంగ్రెస్ లోకి వివేక్ : మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. బీజేపీకి వివేక్ రాజీనామా చేసారు. ఇంత కాలం బీజేపీలో పని చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదలు చెబుతూ..పార్టీకి వివేక్ రాజీనామా చేసారు. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపారు. రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన సమయంలోనే వివేక్ కూడా తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచారం సాగింది.
కానీ, వివేక్ ఖండించారు. తాను బీజేపీ నుంచి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. కానీ, కాంగ్రెస్ నేతలతో పాటుగా రేవంత్ రెడ్డి, వ్యూహకర్త సునీల్ కనుగోలు వివేక్ తో సమావేశమయ్యారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. దీని పైన తన మద్దతు దారులతో చర్చించిన తరువాత వివేక్ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరుతున్నారు.

చెన్నూరు నుంచి బరిలోకి : ఇక, కాంగ్రెస్ లో చేరిన తరువాత వివేక్ కు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనే చెన్నూరు నుంచి పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, వివేక్ కాంగ్రెస్ నుంచి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, చెన్నూరు నుంచి వివేక్ కుమారుడిని బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం రాహుల్ తో వివేక్ తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ తో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ తుది జాబితా ఈ రోజు విడుదల కానుంది. చెన్నూరు నుంచి వివేక్ పోటీ చేస్తారా..కుమారుడికి అవకాశం ఇస్తారా అనేది త్వరలో స్పష్టత రానుంది. చెన్నూరు సీటు పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించాలని భావించారు. వివేక్ రీ ఎంట్రీతో చెన్నూరు విషయంలో ఏం జరుగుతుందనేది త్తేవరలో తేలే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications