ఘోర ప్రమాదం: ట్రాక్టర్-బైక్ ఢీ, ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి
మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మనోహారాబాద్ మండలం పోతారం వద్ద రోడ్డుపై స్థానిక రైతులు ధాన్యం ఆరబోశారు. ధాన్యం కుప్పలు ఉండటంతో రోడ్డుకు ఒకవైపు నుంచే వాహనాలు వెళుతున్నాయి.
ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న నలుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంజనేయులు అనే వ్యక్తి, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రైవేట్ బస్సు-ఆర్టీసీ బస్సు ఢీ: 30 మందికి గాయాలు
రోడ్డుపై ఆగివున్న ప్రైవేట్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 30 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడలోని జాతీయ రహదారిపై కట్టకొమ్ముగూడెం వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కర్నూలులో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నందవరం మండలం ధర్మాపురం వద్ద ఓ కారు ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలోని ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులను వీర నాగమ్మ(60), గౌరమ్మ (61), బేబీ (32)లుకా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రజియాను ఎమ్మిగనూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications