ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS)పై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్‌పై సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
అంతేగాక, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పక్కాగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ విధివిధానాలపై సమీక్షించిన మంత్రులు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 39 లక్షల దరఖాస్తులు వీలైనంత వేగంగా పరిష్కరించాలని నిర్దేశించారు. జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ తీసుకోవాలని సూచించారు.

జీవో 317పై మంత్రి రాజనర్సింహ సమీక్ష
సచివాలయంలో జీవో 317 మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం మరికొన్ని శాఖలు నివేదికలు సమర్పించగా, మరిన్ని విభాగాల నుంచి పూర్తి వివరాలు అందలేదని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. ఈ క్రమంలో జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి, వారి వివరాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది.
వెబ్సైట్ ద్వారా అందిన దరఖాస్తుల్లో సుమారు 30 నుంచి 40 శాతం పునరావృతమైనట్లు కమిటీ గుర్తించింది. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను ఉపయోగించుకొని కొందరు సొంత జిల్లాలకు వెళ్లేందుకు తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు కమిటీ దృష్టికి తెచ్చారు. నష్టపోయిన వారి వివరాలు మాత్రమే గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.












Click it and Unblock the Notifications