బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి
హనుమకొండ: బీఆర్ఎస్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన హనుమకొడ జిల్లా కాజిపేట మండలం మడికొండలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడికొండకు చందిన కలకోట స్వప్న(40) ఎస్సీ కాలనీ వద్ద శనివారం రాత్రి డివైడర్ చెట్ల మధ్య నుంచి రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి హనుమకొడకు వెళ్తున్న రాజయ్య కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ప్రమాద సమయంలో డ్రైవర్ కారు నడుపుతుండగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య పక్కన కూర్చుని ఉన్నారు. కారును బాపూజీనగర్‌లో వదిలేసి మడికొండ పోలీసులకు రాజయ్య సమాచారం ఇచ్చి వెళ్లిపోయారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ లభించలేదు. స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అంతకుముందే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, చివరకు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ తరపున పోటీ చేసి లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications