
RS Praveen Kumar: నేడు బీఎస్పీలోకి ఆర్ఎస్పీ.. 'అదే నా లక్ష్యం.. ఒక్క క్షణం కూడా వృథా చేయదలుచుకోలేదు'
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరనున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కాలేజీ మైదానంలో జరిగే సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో ఆయన బీఎస్పీ కండువా కప్పుకోనున్నారు. తన భవిష్యత్ ఎజెండాను,కార్యాచరణను ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ప్రకటించనున్నారు.ప్రవీణ్ కుమార్ చేరికతో బీఎస్పీ కచ్చితంగా బలోపేతమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రవీణ్ కుమార్ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాలు,కేసీఆర్ పాలనపై తనదైన శైలిలో స్పందించారు.
IPS
RS
Praveen
Kumar
:అనూహ్య
నిర్ణయం-పదవికి
రాజీనామా-తెలంగాణ
రాజకీయాల్లో
మరో
సంచలనం..?

కేసీఆర్ ఒక్కరే రాజకీయాలు చేయాలా...?
రాజకీయాలు ఏ ఒక్కరికో పరిమితం కావని... కేసీఆర్ ఒక్కరే రాజకీయాలు చేయాలా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.బహుజనులు రాజకీయాలు నేర్చుకుంటే తప్పేంటని అన్నారు. బహుజన రాజకీయాలు చరిత్రాత్మక అవసరమని అభిప్రాయపడ్డారు.రాజకీయాల్లోకి రావడం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదన్నారు.
ఆర్నెళ్లుగా దానిపై ఆలోచిస్తున్నానని చెప్పారు. ఏం చేసినా నిబద్దతతో చేయడం తనకు అలవాటని... గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం చిన్న ప్రపంచంలా తోచిందని అన్నారు. అందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు.దగా పడ్డ ప్రజలకు అండగా, బహుజనుల అభివృద్ధే లక్ష్యంగా బీఎస్పీ పనిచేస్తుందన్నారు.

శాస్త్రీయ అధ్యయనం లేకుండా దళిత బంధు...
ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ ఏడేళ్లుగా లేని పథకం... హుజురాబాద్ ఉపఎన్నిక ముందే ఎందుకొచ్చిందో మేదావులు ఆలోచించాలన్నారు.
బహుజనులకు తరతరాలుగా అన్యాయం జరిగిందని.. కులాలు, మతాల పేరిట వారిపై దాడులకు పాల్పడి రాజకీయాలకు దూరంగా పెట్టారని ఆరోపించారు. అందుకే బహుజన రాజ్యాధికారం కోసం పనిచేయాలనుకున్నానని... ఆ దిశగా ఒక్క క్షణం కూడా వృథా చేయదలుచుకోలేదని అన్నారు.

ఆ డబ్బుతో ఇవన్నీ చేయొచ్చు...
'దళితబంధుకు సంబంధించి ఏమేం ప్రతిపాదనలు చేస్తే బాగుంటుందని మా మంత్రిగారు అడిగారు. అనాదిగా పీడిత వర్గాలు చదువు వల్లనే ఆర్థిక వ్యవస్థలో భూమిక వహించాయి. ఆ చదవుతోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అర్థమవుతుంది. కాబట్టి ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఉన్న రూ.16 వేల కోట్లతో విద్య, వైద్యం, నైపుణ్యాల కల్పనతో పాటు వెల్ఫేర్ యూనివర్సిటీ తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుందని సూచించాను.
దీనిపై ఒక నోట్ కూడా ఇచ్చాను. కానీ దళిత బంధు సమావేశంలో దీనిపై చర్చ లేదు. ఇంటికి రూ.10లక్షలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. కానీ ఆ డబ్బుతో పేద విద్యార్థులకు పక్కా భవనాలు,100 ఇంటర్నేషనల్ స్కూల్స్,ఆన్‌లైన్ యూనివర్సిటీలు పెట్టవచ్చు. కేసీఆర్‌పై వ్యక్తిగత కోపమేమీ లేదు. కానీ శాస్త్రీయ అధ్యయనం లేకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని అనిపించింది.' అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.కేసీఆర్ దళిత కుటుంబాలకు నగదు సాయం చేస్తామనడాన్ని నేను వ్యతిరేకించట్లేదు. కానీ హడావుడిగా దాన్ని అమలుచేయడం సరికాదన్నారు.

బహుజన రాజకీయాలు చరిత్రాత్మక అవసరం
ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డంకులు ఉంటాయని... అలాగే బహుజన రాజ్యాధికార దిశగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. 1948లో తెలంగాణ సాయుధ పోరాటం, 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పాలకులు అణచివేశారని... కానీ మలి దశ తెలంగాణ ఉద్యమం లక్ష్యాన్ని చేరుకుందని అన్నారు. 1990లో కాన్షీరాం బహుజన రాజకీయాలు చేసినప్పుడు తెలుగు సమాజంలో అంత పరిపక్వత లేదన్నారు.
ప్రస్తుతం అన్ని ఉద్యమాలతో ప్రజలు విసిగిపోయారని... బహుజన రాజకీయాలు చరిత్రాత్మక అవసరమని అన్నారు.కోదండరాం,జయప్రకాశ్ నారాయణ,జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు రాజకీయాల్లో విఫలమయ్యారని నేను అనను. రాజకీయాల్లో వారొక ప్రయోగం చేశారు. ప్రస్తుతం ఉన్న పార్టీలపై నాకేమాత్రం సంతృప్తి లేదు. కేవలం టోకెనిస్టు పాలిటిక్స్,ప్రజల దృష్టిని మరల్చే ఎజెండాలతో ముందుకెళ్తున్నారు.

అదే నా లక్ష్యం...
రాజ్యాధికారం వస్తే తన సుఖాల కోసం ప్రజలను మోసం చేయనని ప్రవీణ్ కుమార్ అన్నారు. తనకు ఒక బెడ్ రూమ్,బాత్ రూమ్ ఉంటే చాలునని... ప్రజలు నాకన్నా గొప్పగా జీవించేలా చూడటమే తన లక్ష్యమని అన్నారు. అన్ని రంగాల్లో వారికి గొప్ప అవకాశాలు కల్పిస్తామన్నారు.బహుజనులను కేవలం ఓటుబ్యాంకుగా చూస్తున్నారని... బహుజన వాదంతో వారందరినీ రాజ్యాధికారం వైపు నడిపిస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తన వెంట లక్షలాది మంది బహుజన బిడ్డలు ఉన్నారని పేర్కొన్నారు.
తాను చీఫ్‌గా ఉన్న స్వేరో సంస్థ... దాని పని అది చేస్తుందన్నారు. స్వేరో అనేది ఒక భావన అని... అదొక సిద్ధాంతమని పేర్కొన్నారు. అభిమానం ఉండాలి గానీ దురభిమానం వద్దని స్వేరోలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. విమర్శలు చేసేవారికి సమాధానాలు చెప్పాలి గానీ గాయపరిచే మాటలు వద్దన్నారు.

సభ ఏర్పాట్లు పూర్తి...
మరోవైపు నల్గొండ ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఇప్పటికే బీఎస్పీ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు స్వచ్చందంగా భారీ ఎత్తున జనం తరలివస్తారని బీఎస్పీ నాయకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి యువత కదిలి వస్తారని ఆశిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ చేరిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బహుజనుల ప్రాధాన్యతను పెంచుతుందని... వారిని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతుందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ భవిష్యత్ సీఎంగా ప్రవీణ్ కుమార్‌ను కీర్తిస్తున్నారు.

గత నెల పదవికి రాజీనామా
గత జులై 19న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఐపీఎస్ అధికారిగా,గురుకులాల కార్యదర్శిగా తనదైన ముద్ర వేసి... తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు ప్రవీణ్ కుమార్. పదవికి రాజీనామా చేసిన వేళ... తన భవిష్యత్ అడుగులు రాజకీయాల్లోకే అని చెప్పకనే చెప్పేశారు.
బహుజన మహనీయులు పూలే,బాబా సాహెబ్ అంబేడ్కర్,కాన్షీరాం బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు.ఐపీఎస్‌గా,గురుకులాల కార్యదర్శిగా తాను చేసింది కేవలం ఒక శాతం మాత్రమేనని... మిగతా 99శాతం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. 26 ఏళ్ల ఐపీఎస్ ప్రస్థానంలో ప్రవీణ్ ప్రయాణం విభిన్నంగా సాగిందనే చెప్పాలి. బెల్లంపల్లి,కరీంనగర్ ప్రాంతాల్లో ఆయన పనిచేసినప్పుడు ఎంతోమంది మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చారు. గురుకులాల కార్యదర్శిగా ఆ విద్యా సంస్థలను ఉన్నత స్థితికి చేర్చారు. మాలవత్ పూర్ణను ఎవరెస్ట్ ఎక్కించి దేశమే గర్వపడేలా చేశారు.