తెలంగాణలో పీక్స్‌కు చేరిన పాలిటిక్స్: భారీగా హౌస్ అరెస్టులు
T Harish Rao: ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి చెందిన శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి- కాంగ్రెస్‌లో చేరిన అదే పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. హౌస్ అరెస్టులకు దారి తీసింది. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల గృహ నిర్బంధానికి తెర తీసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి ఇటీవలే నిప్పులు చెరిగారు. వారి వ్యవహార శైలిని ఎండగట్టారు. వారికి చీరె, గాజులు పంపించారు. చీరె, గాజులు కొనుక్కోని నియోజకవర్గాల్లో పర్యటించాలంటూ హితవు పలికారు. వారికి ఇజ్జత్ లేదంటూ మండిపడ్డారు.

కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్‌పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్- జగిత్యాల, కాలె యాదయ్య- చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల, టీ ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్, అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి, గూడెం మహిపాల్ రెడ్డి- పఠాన్‌చెరును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారాయన.
వారిపై అనర్హత వేటు వేయాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పును వెంటనే అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. కడియం శ్రీహరిని పచ్చి మోసగాడు, దానం నాగేందర్‌ను బిచ్చగాడిగా అభివర్ణించారు.
దానం నాగేందర్ గతంలో అనేక పార్టీలు ఫిరాయించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్- తెలుగుదేశం- కాంగ్రెస్- బీఆర్ఎస్- మళ్లీ కాంగ్రెస్.. ఇలా దానం నాగేందర్ పూటకో పార్టీ మారుతూ వచ్చాడని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉప ఎన్నికల కోసం ఎదురు చూస్తోన్నారని, ఫిరాయింపుదార్లకు డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు.. కౌశిక్ రెడ్డికి అండగా నిలిచారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బషీర్ బాగ్‌లో గల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

నేడు ఛలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. ఈ ఉదయం 11 గంటలకు మల్లంపేట్‌లోని శంభీపూర్ రాజు నివాసం నుంచి ర్యాలీగా అరికెపూడి గాంధీ నివాసానికి బయలుదేరి వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో- పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. హరీష్ రావు సహా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. వారి నివాసాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ పరిణామాలతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications