తీగల కృష్ణారెడ్డి ఇంట తీవ్ర విషాదం
హైదరాబాద్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మనవడు కనిష్క్ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం రాత్రి గొల్లపల్లి కలాన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనిష్క్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
అటుగా వెళ్తున్నవారు గమనించి కనిష్క్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. కాగా, మలక్ పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కనిష్క్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో భవిష్యత్ ఉన్న కనిష్క్ రెడ్డి చిన్నతనంలోనే ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు-టిప్పర్ ఢీ: ఐదుగురు మృతి
తమిళనాడు తిరుత్తణిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 28మంది గాయపడ్డారు. ఆర్కే పేట్టై నుంచి తిరుత్తణికి వెళ్తున్న బస్సును తిరుత్తణి నుంచి షోఏలింగర్ వైపు వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఈ ప్రమాద ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో గాయపడినవారిని తిరుత్తణి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను ఎస్ పాండురంగన్ (60), ఎస్ శివానందం (53), కె మహేష్ (40), పి మురళి (38)గా గుర్తించారు.
ఈ ప్రమాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రెషియా ప్రకటించారు.












Click it and Unblock the Notifications