నయీం నేర సామ్రాజ్యం: చావు తర్వాత వెలుగు చూస్తున్న సంచలనాలు
హైదరాబాద్: కరుడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్ స్టర్ నయీం చనిపోయాక కూడా సంచనాలకు కేంద్ర బిందువుగా మారాడు. రెండు దశాబ్దాల నయీం నేర చరిత్ర నయీం నేర చరిత్ర అతడి చావు తర్వాత కూడా కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఓ క్రిమినల్ పేరు చావు తర్వాత కూడా మారుమ్రోగి పోతుంది.
అనామకుడిగా ఉన్న నయీం గ్యాంగ్ స్టర్‌గా ఎలా ఎదిగాడు. నేర సామ్రాజ్యానికి కేరాఫ్‌గా నయీం ఎలా మారాడు. నయీం తండ్రి విద్యుత్ శాఖలో పదవి విరమణ పొందారు. నయీంకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. ఇంట్లో పెద్దవాడైన నయీం చిన్నప్పటి నుంచి విపరీత దోరణితో వ్యవహిరించేవాడు.
చిన్నప్పటి నుంచి దూకుడూగా స్వభావంతో కనిపించే నయీం, పది మందిలో తాను ప్రత్యేకంగా కనిపించాలని తహతహలాడేవాడు. ఈ క్రమంలో భువనగిరిలో లక్ష్మీ నరసింహా కాలేజీలో డిగ్రీ చదువుతుండగా విద్యార్ధి నాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత మావోయిస్టుల వైపు ఆకర్షితుడయ్యాడు.

ఆ తర్వాత ఆర్ఎస్‌యులో చేరిన నయీం, నెమ్మది నెమ్మదిగా పీపుల్స్ వార్‌లో చేరాడు. ఐపీఎస్ వ్యాస్ హత్యకేసుతో రాష్ట్ర వ్యాప్తంగా నయీం పేరు తెరపైకి వచ్చింది. 1993లో డిఐజి వ్యాస్‌ను ఎల్‌బీ స్టేడియంలో కాల్చి చంపడంతో నయీం పేరు రాష్ట్రమంతా మారు మ్రోగింది.
ఆ తర్వాత ఓ ఆపరేషన్‌లో భాగంగా యాదగురి గుట్టకు వచ్చిన నయీంను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. ఆ తర్వాత 1997లో గద్దర్‌పై దాడి జరిగే దాకా నయీం పీపుల్స్ వార్‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత నయీం సోదరితో పీపుల్స్ వార్ మాజీ నక్సలైట్ ఒకరు ప్రవర్తించిన తీరుతో నొచ్చుకున్న నయీం ఆ విషయాన్ని జైల్లో ఉన్న శాఖమూరి అప్పారావుకు చెప్పాడు.
దీనిపై అటు పీపుల్ వార్ పార్టీ కానీ ఇటు శాఖమూరి కానీ సరిగ్గా స్పందించలేదు. అదే సమయంలో నయీం సోదరుడు అలీముద్దీన్‌ను నక్సలైట్లు చంపేశారు. ఈ రెండు సంఘటనలతో నొచ్చుకున్న నయీం ఉద్యమ నేతలతో విభేదించి బయటకు వచ్చాడు. నక్సలైట్లకు వ్యతిరేకంగా కార్యకలాపాలను నిర్వహిస్తూ పోలీసులకు చేరువయ్యాడు.

దీంతో వ్యాస్ కేసులో నయీంకు బెయిల్ లభించింది. పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తూ ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని దందాలు, సెటిల్ మెంట్లు చేయడం మొదలుపెట్టాడు. పోలీసులు, ప్రభుత్వాల బలహీనతలనే గ్యాంగ్‌స్టర్ నయీం తన బలంగా మార్చుకున్నాడు. 90వ దశకం ఆరంభం మొదలు కన్ను మూసేవరకు పోలీసుల కనుసన్నల్లోనే నయీం ప్రస్థానం సాగింది.
పోలీసుల అండ చూసుకుని నక్సలైట్లు, పౌర హక్కుల నేతలపై విషం కక్కాడు. నక్సలైట్ల ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేయాలనేది పోలీసులు ఉద్దేశం. ఈ క్రమంలో పోలీసులకు అందివచ్చిన ఆయుధంలా నయీంను వాడుకున్నారు. కానీ నయీం లక్ష్యం వేరు. ఉద్యమ సమయంలో కొన్నాళ్లు తూపాకి పట్టడంతో బాగా రాటుదేలాడు.
నక్సలైట్లుకు వ్యతిరేకంగా ర్యాలీలు, పోస్టర్లు ముద్రించేవాడు. మావోయిస్టు సాంబశివుడు తల్లిదండ్రుల ఇంట్లోకి నయీం విష నాగులను విడిపెట్టాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నక్సలైట్ల సమాచారాన్ని ఎప్పటికప్పడు పోలీసులకు చెప్పడంతో వారికి వ్యక్తిగతం బాగా దగ్గరయ్యాడు.

దీంతో నయీం ఏం చేసినా పోలీసులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. దీంతో ఆ గ్యాంగ్ సాయంతో దోపిడీలు, దందాలు, సెటిల్ మెంట్లు చేసేవాడు. నయీం ఆగడాలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా నక్సలైట్ల సానుభూతి పరులపై తెగబడ్డాడు. పలువురు నక్సలైట్లను వెంటాడి, వేటాడి వేధింపులకు గురి చేశాడు.
మావో అగ్రనేతల కదలికలు, వారి డెన్‌లు, వ్యూహాలు పోలీస్ బాస్‌లకు పూసగుచ్చినట్లు వివరించి వారి ఏరివేతకు సహకరించాడు. భువనగిరికి చెందిన పౌరహక్కుల నేత బెల్లి లలితను అతి కిరాకతంగా నరికి చంపాడు. ఆమెతో పాటు మాజీ నక్సలైట్ ఈదన్న హత్య, పౌర హక్కుల నాయకులు పురుషోత్తం, ఆజం అలీ, కనకా చారి, మావోయిస్టు సాంబశివుడు హత్యల్లో నయీం గ్యాంగ్ హస్తం ఉందన్న తీవ్ర ఆరోపణలున్నాయి.
ఈ కేసుల్లో నయీం అనుచరులు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పౌర హక్కుల నాయకుడు పురుషోత్తం హత్య తానే చేశానని మీడియా ఎదుట నయీం అంగీకరించాడు. ఈ సందర్భంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా యుద్దం సాగిస్తానని శపధం కూడా చేశాడు.

అదే విధంగా నర్సా కోబ్రాస్, నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, గ్రీన్ టైగర్స్, బ్లాక్ టైగర్స్, క్రాంతి సేన, జన సేన, తిరుమల టైగర్స్, రాయలసీమ టైగర్స్ లాంటి సంస్థల పేర్లతో స్టేట్ మెంట్లు ఇచ్చేది కార్యకలాపాలు సాగించేది నయీం గ్యాంగ్ అనే వాదనలు కూడా ఉన్నాయి.
ఈ విషయం పోలీసులకు తెలిసినా తమకు సాయం చేస్తున్నాడనే నెపంతో పట్టించుకోలేదు. పోలీసులు అధికారికంగా చేయలేని కొన్ని పనులను నయీంతో చక్కబెట్టుకునే వారనే వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో నయీంకు పోలీసులు ఇచ్చిన స్వేచ్చ ఉన్మాది చేతిలో కత్తిలా మారింది.
దందాలు, సెటిల్‌మెంట్లలో పోలీసులకు వాటాలు ఇచ్చి సొంత మనిషిలా మారాడు. 2007లో ఓ సారి పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరు పరిచినా తప్పించుకు పోయాడు. గుజరాత్‌లో వివాదాస్పదమైన సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులోనూ నయీం పేరు ప్రముఖంగా వినిపించింది.
కోవర్టుగా ప్రయాణం ప్రారంభించి కోటీశ్వరుడిగా స్థానం సుస్థిరం చేసుకుని ప్రభుత్వ పెద్దలనే వణికించే స్థాయికి ఎదిగిన నయీం చివరకు పోలీసుల చేతిలోనే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ షాద్ నగర్‌లోని మిలీనియం టౌన్ షిప్‌లో పోలీసుల ఎదురుకాల్పుల్లో తూటాలకు బలయ్యాడు.












Click it and Unblock the Notifications