ఓటుకు నోటు: ఏసీబీ కోర్టుకు ఫోరెన్సిక్ రిపోర్ట్, గొంతు ఎవరిదో తేల్చారు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరి (ఎఫ్‌ఎస్‌ఎల్) ప్రాథమిక నివేదిక ఏసీబీ న్యాయస్థానానికి అందజేసింది. ఈ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కీలకం కానుంది. గత కొద్ది రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డులను ఎఫ్‌ఎస్‌ఎల్ నిశితంగా పరిశీలించింది.
ఎఫ్ఎస్‌ఎల్ ప్రాథమిక నివేదికను న్యాయస్థానానికి అందించింది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, స్టీఫెన్ సన్ మధ్య జరిగిన సంభాషణలు, స్టీఫెన్ సన్ ఇంట్లో రికార్డయిన దృశ్యాలు, ఏపీ సీఎం చంద్రబాబుతో స్టీఫెన్ మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియో టేపులకు సంబంధించిన వివరాలను కోర్టుకు అందజేశారు.

కాగా, ఈ ఎఫ్ఎస్ఎల్ నివేదిక కాపీని తమకు ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ మేరకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక కాపీని ఏసీబీకి అందాక ఈ కేసులో నిందితులపై తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిదేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆడియో టేపు ట్యాప్ చేసినది కాదని, ఫోన్‌లో రికార్డయినదేనని తేలిందని చెబుతున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఇది కట్ అండ్ పేస్ట్ వ్యవహారంకూడా కాదని నివేదికలో స్పష్టం చేసిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications