g20 summit: ‘జీ20 నేతలకు మోడీ స్వాగతం’.. వస్త్రంపై తెలంగాణ నేతన్న అద్భుతం
కరీంనగర్: దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సమావేశాల నేపథ్యంలో తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఓ చేనేత కార్మికుడు తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు. జీ 20 దేశాల దేశాధినేతల చిత్రాలతో సహా.. వారికి ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలుకుతున్నట్లు ఉన్న ఫోటోలను వస్త్రంపై నేసి.. తన నేత కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్‌కు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ మరమగ్గాలపై రకరకాల కళాఖండాలు నేస్తూ.. గతంలో అందరినీ అబ్బురపరిచాడు. అగ్గిపెట్టెలో పట్టే చీర, దబ్బనంలో దూరే చీర, నేతన్న సిరిపట్టు, ఇలా ఎన్నో వస్త్రాలపై కళారూపాలను రూపొందించి తన ప్రతిభను చాటుకున్నాడు.

తాజాగా జీ20 సదస్సు జరుగుతున్న సందర్భంగా.. 20 దేశాల దేశాధినేతల చిత్రాలను మరమగ్గంపై రూపొందించాడు. 20 దేశాధినేతల చిత్రాలతో పాటు భారతదేశం మ్యాప్.. అందులో మూడు రంగుల జాతీయ జెండా.. ప్రధాని నరేంద్ర మోడీ నమస్తే అని వారికి స్వాగతం పలుకుతున్న చిత్రాలను, ఇరువైపులా జీ 20 లోగో వచ్చే విధంగా తయారు చేశాడు.
వారం రోజులు శ్రమించి దీన్ని రూపొందించినట్లు హరిప్రసాద్ తెలిపారు. తనకు అవకాశం కల్పిస్తే ప్రధాని మోడీకి అందజేస్తానని చెప్పారు. గతంలోనూ జీ20 లోగో నేసి ప్రధానికి పంపించినట్లు.. దాని గురించి మన్‌కీ బాత్‌లో కూడా మోడీ ప్రస్తావించినట్లు హరిప్రసాద్ గుర్తుచేశారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సహాయక సహకారాలు అందిస్తే మరిన్ని అద్భుతాలను చేసి తెలంగాణ కీర్తి ప్రపంచ వ్యాప్తంగా నిలుపుతానని హరి ప్రసాద్ అంటున్నారు.












Click it and Unblock the Notifications