తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవం: తొలి దళిత నేత
తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. అయితే, ఒకే ఒక నామినేషన్ రావడంతో ప్రసాద్ కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
శాసనసభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు.

కాగా, ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు ప్రతిపక్షాలు సైతం మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
సభాపతిగా ప్రసాద్ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ ఆయనే కానుండటం విశేషం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం గడ్డం ప్రసాద్ పేరును అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించి శాసనసభ సమావేశాలను ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత డిసెంబర్ 9న మూడో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు శాసనసభలో సీనియర్ నేత ఎంఐఎం అధ్యక్షుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించారు. ముందుగా ఆయన రాజ్భవన్లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శాసనసభలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 100 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. మిగితా ఎమ్మెల్యేలు పలు కారణాలతో ప్రమాణం చేయలేదు.












Click it and Unblock the Notifications