మళ్లీ యూటర్న్!: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరోసారి యూటర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయన ఇటీవల మళీ బీఆర్ఎస్ పార్టీకి దగ్గరైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి.. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను కలవడం, తిరిగి బీఆర్ఎస్లోకి వెళుతున్నట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. అధికార పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ మారుతుండటంతో ఆ ప్రభావం ఇతర ఎమ్మెల్యేలపై పడే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. దీంతో పీసీసీ నాయకత్వం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించింది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా విందు, రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కూడా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి గైర్హాజరు కావడం గమనార్హం.
ఈ క్రమంలో గురువారం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. చర్చలు సఫలం కావడంతో నేడు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కృష్ణ మోహన్ రెడ్డి కలిశారు. బీఆర్ఎస్లోకి గద్వాల ఎమ్మెల్యే వెళుతున్నారన్న ప్రచారం జరిగిన సందర్భంగా సీఎం రేవంత్‌ను కృష్ణ మోహన్ రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక, తాజా పరిణామాలతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, గద్వాల కాంగ్రెస్ నేతలు తనను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ బహిరంగంగానే వెల్లడించారు. దీంతో అప్రమత్తం అయిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో మంతనాలు జరిపింది. మంత్రుల చర్చలు ఫలించడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications