ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలి ..తెలంగాణా కాంగ్రెస్ నేతల అభిప్రాయం
ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ , రాహుల్ గాంధీ నాయకత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అవసరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపే సత్తా గాంధీ కుటుంబానికి ఉందని ఆయన అన్నారు.
Recommended Video
గతంలో సోనియా కాంగ్రెస్ ను ఏకతాటిపై నిలిపే అధికారంలోకి తీసుకువచ్చారని అయినప్పటికీ ప్రధాని తదితర మంత్రి పదవులకు దూరంగా ఉండి పార్టీ కోసం సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ పనిచేశారని తెలిపారు. ఇక సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ నాయకత్వానికి తామెప్పుడూ మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని సమర్ధించారు. పార్టీకి సంబంధించిన అంతర్గత సూచనలు చేయకుండా బహిరంగ లేఖలు రాయటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అవకాశం ఉన్నప్పటికీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవుల కోసం ఆరాటపడలేదని, పదవులకు దూరంగా నే పార్టీ కోసం పని చేశారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

ఏఐసిసి అధ్యక్షులు గా గాంధీ కుటుంబమే కొనసాగాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక బలమని, ఒక భరోసా అని ఆయన పేర్కొన్నారు. గాంధీ కుటుంబం కాకుండా ఎవరు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినా కష్టమేనని ఆయన పేర్కొన్నారు. పార్టీని చీల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న సీనియర్ల పై చర్యలు తీసుకోవాలని, ప్రజా నాయకులు కాకపోయినా పార్టీ వారికి కీలక బాధ్యతలు ఇచ్చి గౌరవించింది అని జగ్గారెడ్డి అన్నారు.
గాంధీ కుటుంబం నుండి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోయినా
ఆమె పార్టీ కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానికి ఉందని వ్యాఖ్యానించారు . అలాంటి గాంధీ కుటుంబాన్ని విమర్శించటంపై ఆయన విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications