యువతిపై గ్యాంగ్ రేప్: సూసైడ్ లెటర్లో వాళ్ళపేర్లు రాసి మృతి; బాధితకుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు చేసిన అరాచకానికి ఓ యువతి తన నిండు ప్రాణాలను తీసుకుంది. తన జీవితాన్నిఆగం చేశారని, బాధిత యువతి రాసిన చివరి సూసైడ్ లెటర్ స్థానికుల హృదయాలను కలచివేస్తోంది.

మహబూబాబాద్ జిల్లాలో దారుణం .. ఓ యువతిపై నలుగురు గ్యాంగ్ రేప్
అసలేం జరిగిందంటే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన 23 సంవత్సరాల యువతి పై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి పక్కనే ఉంటున్న ఓ యువకుడు అతని స్నేహితులతో కలిసి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. అవమానాన్ని భరించలేక బాధిత యువతి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పురుగుల మందు తాగిన యువతి.. సూసైడ్ నోట్ రాసి మృతి
ఈనెల 18వ తేదీన పురుగుల మందు తాగి బాధిత యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు . అయితే పరిస్థితి విషమించడంతో బాధిత యువతి తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఒక పేపర్ పైన రాసి బుధవారం నాడు ప్రాణాలు విడిచింది. చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న సమయంలో యువతి రాసిన సూసైడ్ నోట్ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

తన జీవితం నాశనం చేసిన వారిని చెప్పుతో కొట్టాలి .. సూసైడ్ నోట్ లో యువతి
యువతి రాసిన సూసైడ్ నోట్ లో నలుగురు నిందితుల పేర్లను యువతి పేర్కొంది . ఆ నలుగురు తన జీవితాన్ని నాశనం చేశారని వారిని చెప్పుతో కొట్టాలని పేర్కొంది. తాను పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవడం లేదని, అవమాన భారాన్ని మోయడం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు నిందితులను నలుగురిపై కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 17 నుంచి 18 మధ్య రాత్రి వరకూ నలుగురు నిందితులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు .. ఆలేరులో భారీ బందోబస్తు
బాధిత యువతి రాసిన సూసైడ్ నోట్లో యాట సాగర్, నజీమ్, సద్దాం హుస్సేన్, కోయిలకొండ జగదీశ్ ల పేర్లు రాయడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. వీరిలో ఒకరు ప్రజాప్రతినిధి కాగా, ఒకరు పోలీస్ కానిస్టేబుల్, మరొకరు ఆటో డ్రైవర్ అని సమాచారం. బాధిత యువతి మరణం నేపథ్యంలో ఆలేరు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో బాధిత కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అమ్మాయికి అన్యాయం జరిగిందని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. దోషులు ఎంతటి వారైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications