పొత్తు షాక్: బాలకృష్ణ-బాబు ఫ్యామిలీ ఓటు టిడిపికా, బిజెపికా? కెసిఆర్ ఓటేయరు!
హైదరాబాద్: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఓటు ఎవరికి వేస్తుందనే సస్పెన్స్ కనిపించింది. అందుకు జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఆసక్తికర రాజకీయాలే కారణం.
టిడిపి, బిజెపి కూటమిలో భాగంగా తొలుతగా జూబ్లీహిల్స్ స్థానాన్ని బిజెపికి సర్దుబాటు చేశారు. ఊహించని పరిణామాల నేపథ్యంలో తొలి నుంచి ఈ సీటును ఆశిస్తున్న టిడిపి అభ్యర్థి ఆకుల వెంకటేశ్వర్ రావు నామినేషన్ దాఖలు చేసి చివరి నిమిషంలో టిడిపి బీఫారం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్‌లో అటు టిడిపి, బిజెపి నుంచి అభ్యర్థులు ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారం చేసుకున్నారు. ఇదే డివిజన్‌లో నివసించే చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యుల ఓట్లు ఈ ఇద్దరి అభ్యర్థుల్లో ఎవరికి వేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

పొత్తులో భాగంగా చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ కుటుంబ సభ్యులు బిజెపి అభ్యర్థికి ఓటు వేస్తారా? లేక పార్టీ నుంచి బీఫారం పొందిన టిడిపికి అభ్యర్థికి ఓటు వేస్తారా? అనేది ఆసక్తిగా మారింది. బాలకృష్ణ కుటుంబం ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకుంది. చంద్రబాబు సతీమణి రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. తమ ఓటు ఎప్పటికీ టిడిపికేనని చెప్పిన విషయం తెలిసిందే.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఓటు హక్కు తన స్వగ్రామం చింతమడకలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఓటు వేసే అవకాశం లేదు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా నారావారిపల్లెలో ఓటు హక్కు ఉంది.












Click it and Unblock the Notifications