హైదరాబాద్ వాసులకు GHMC హెచ్చరిక.. రోడ్డుపై చెత్త వేస్తే జైలుకే !
హైదరాబాద్ వాసులకు GHMC కీలక అలర్ట్ జారీ చేసింది. ఇకపై నగరంలో రోడ్లపై చెత్త వేస్తే కేవలం జరిమానా మాత్రమే కాదు.. జైలు శిక్ష కూడా తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి కేసుల్లో కేవలం జరిమానాలు మాత్రమే విధించేవారు. కానీ ఇప్పుడు సెక్షన్ 70(B), 66 సీపీ యాక్ట్ ప్రకారం చెత్త వేసినట్లు రుజువైతే నిందితులకు గరిష్టంగా 8 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 1,000 జరిమానా విధించబడనుంది. ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ మేరకు నగర శుభ్రత కోసం GHMC అధికారులు, పోలీసులు సంయుక్త బృందాలు ఏర్పాటు చేశారు. చెత్త ఎక్కువగా పేరుకునే హాట్‌స్పాట్‌లను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలానే పర్యవేక్షణ కోసం బృందాలను నియామకం చేయనున్నారు.

ఇప్పటికే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై చెత్త వేసినందుకు ఐదుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధించబడింది. అధికారులు దీన్ని ఆరంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
కాగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల దోమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా, గ్యాస్ట్రో వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రోడ్లపై చెత్త పేరుకుపోవడం వల్ల ట్రాఫిక్‌కు ఆటంకం కలుగుతోంది. మున్సిపల్ సిబ్బంది శుభ్రత సేవలు అందిస్తున్నప్పటికీ, కొందరు పౌరుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, శుభ్రతను కేవలం అధికారుల బాధ్యతగానే కాకుండా పౌరులూ తమ భాగస్వామ్యంగా చూడాలని అంటున్నారు.
పబ్లిక్ ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండటం సామాజిక బాధ్యత" అని చెబుతున్నారు. GHMC అధికారులు రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో ప్రత్యేక చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. చెత్తపై ఫిర్యాదులు స్వీకరించడానికి హెల్ప్‌లైన్ నంబర్లు ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications