ఉప్పొంగుతున్న గోదావరి.. భద్రాద్రి రామాలయం వద్దకు భారీగా నీళ్లు..
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 46.6 అడుగులకు చేరిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం గోదావరి వద్ద నీటిమట్టం 46.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మూడు రోజుల క్రితం 30 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఇవాళ ఉదయానికి 46 అడుగులకు చేరింది. అలాగే గోదావరి నీటిమట్టం పెరిగిన నేపథ్యంలో స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగిపోయాయి. నదిలో స్నానాలు చేసే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.

గత రాత్రి నుంచి భద్రాచలంలో భారీ వర్షం కారణంగా వర్షపు నీరు అంతా రామాలయం సమీపంలోకి చేరుకుంది. నీళ్లు వెళ్లే దారి లేకపోవడంతో రామాలయం చుట్టూ వరద నీరు పేరుకుని పోయింది. ఇదిలాఉండగా దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక డైవర్షన్ రోడ్డుపైకి వరద నీరు భారీగా చేరింది. దీంతో భద్రాచలం- చర్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు రామచంద్రాపురం మీదుగా వెళ్తున్నారు. ఏపీలోని కూనవరం, నెల్లిపాక గ్రామాల వద్ద సైతం వరదనీరు రోడ్డుపైకి చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరద పరిస్థితిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు.












Click it and Unblock the Notifications