వనం నుంచి జనంలోకి.. మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క
ములుగు: మేడారం జాతర (medaram jatara)లో రెండో రోజు అత్యంత కీలక ఘట్టం ఆష్కృతమైంది. వనం వీడి జనం మధ్యలోకి సమ్మక్క తరలివచ్చింది. మేడారం నుంచి వెళ్లిన పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని జనంలోకి తీసుకొచ్చారు. చిలకలగుట్టలో గంటపాటు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు.
డప్పు చప్పుళ్లు, దివిటీల వెలుగులు, కోయ కళాకారుల నృత్యాలు, ఆదివాసీ తెగల భక్తపారవశ్యం మధ్య సమ్మక్క అడవి నుంచి మేడారం గద్దెపైకి చేరుకుంది. జిల్లా ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో వనదేవతకు స్వాగతం పలికారు.అప్పటికే అమ్మవారి రాకకోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. సమ్మక్క అమ్మవారి రాక నేపథ్యంలో 'జై సమ్మక్క' అంటూ మేడారం పరిసరాలు మార్మోగుతున్నాయి.

వనదేవతకు స్వాగతం పలుకుతూ భక్తులు దారి పొడవునా ముగ్గులు వేశారు. గురువారం రాత్రి మేడారం గద్దెలపైకి సమ్మక్క విచ్చేశారు. అమ్మవారు గద్దెల మీద ప్రతిష్టించే సమయంలో తీవ్ర ఉద్విఘ్నంగా మారింది. రాష్ట్ర మంత్రి సీతక్క జంపన్నవాగు సమీపంలో అమ్మవారికి అధికారికంగా స్వాగతం పలికారు. కాగా, గురువారంనాడు లక్షలాది మంది భక్తులు సమ్మక్క-సారక్కను దర్శించుకున్నారు.
మరోవైపు, బుధవారమే కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు చేరుకుంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకున్నారు. శుక్రవారం ఒక్కరోజు సమ్మక్క-సారక్క అమ్మవార్లు గద్దెలపై ఉండారు. శుక్రవారం భక్తుల దర్శనం అనంతరం శనివారం మళ్లీ సమ్మక్క వనంలోకి వెళ్లనుంది. మేడారం జాతర లక్షలాది భక్తులతో కిటకిటలాడుతోంది. సమ్మక్క-సారక్క నామస్మరణతో మేడారం పరిసరాలు మారుమోగుతున్నాయి.












Click it and Unblock the Notifications