Rythu Bharosa: రైతన్నలకు సంక్రాంతి కానుక.. జనవరి 5 నుంచి రైతు భరోసా దరఖాస్తుల స్వీకరణ?
రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు భరోసాను సమర్థవంతంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకంపై మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు ఉపసంఘం గురువారం సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటలు పండించే ప్రతి రైతుకు రైతు భరోసా పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా సబ్ కమిటీ చర్చించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లించేసుందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నాలుగో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
అర్హులైన రైతులందరికీ భరోసా:
రైతు భరోసా పథకం అమలు , విధి విధానాలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది. పంటలు పండించే ప్రతి రైతుకు రైతు భరోసా పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. దీనివల్ల కౌలు రైతులు , పోడు భూములు సాగు చేస్తున్న రైతులు కూడా లబ్ధి పొందుతారు. రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. జనవరి 5 నుండి 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. ఈ పథకాన్ని జనవరి 14వ తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గానికి సిఫార్సు చేయనున్నారు. మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ నిర్ణయాలు అధికారికంగా అమలులోకి వస్తాయి.

రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం:
రైతులకు పెట్టుబడి సహాయం అందించడడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం తెలంగాణ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ రైతు భరోసా కింద రైతులకు ప్రతి ఏటా రెండు విడతలుగా రూ . 7500 పెట్టుబడి సాయం కింద అందించనుంది. సక్రాంతి నుంచి అమలు చేయాలన్న లక్ష్యంతో కసరత్తు చేస్తుంది.
మంత్రివర్గ ఉపసంఘం బేటీలో రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులను గుర్తించే విధానం. దరఖాస్తు ప్రక్రియను సులభరతం చేసే మార్గాలు. రైతులకు సకాలంలో నిధులు విడుదల చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు పై చర్చించారు. దరఖాస్తు ప్రక్రియ , కావాల్సిన పత్రాల గురించి త్వరలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications