Satavahana University: పొన్నం చొరవతో శాతవాహన యూనివర్సిటీకి మహర్దశ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కరీంనగర్ జిల్లాకు శాతవాహన యూనివర్సిటీని ప్రకటించారు. అప్పుడే 200 ఎకరాల్లో 13 కోర్సులతో యూనివర్సిటీ ప్రారంభం అయింది. అప్పుడు తాత్కాలిక భవనాల్లో కోర్సులు నడిచాయి. ఆ తర్వాత పక్క భవనాలు నిర్మించారు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురైంది. అంతేకాదు బాటనీ, ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సుల నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చేశారు.
దీంతో యూనివర్సిటీ ప్రాధాన్యత కోల్పోయింది.
తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ గురించి ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. యూనివర్సిటీలో ఇంజినీరింగ్, లా కాలేజీలు ఏర్పాటు చేయాలని వీసీ ఉమేశ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వీసీ ఉమేశ్‌కుమార్ విజ్ఞప్తి మేరకు శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కాలేజీలు మంజూరు చేశారు.

సీఎం నిర్ణయంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీకి మహర్దశ రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు చెపట్టిన కొద్ది రోజుల్లోనే ఉమేశ్ కుమార్ కీలకమైన ప్రతిపాదనలు చేశారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్, లా కాలేజీలు ఉన్నట్లే శాతవాహనలోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒకే చెప్పింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ కు యూనివర్సిటీ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాంపస్‌లోని లైబ్రరీ ఆడిటోరియంలో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరిగేలా శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ నెల 7న మెగా జాబ్ మేళా కూడా నిర్వహించారు.












Click it and Unblock the Notifications