తెలంగాణలోని ప్రభుత్వ టీచర్లు టెట్ పరీక్ష రాయాల్సిందే..
తెలంగాణలోని ప్రభుత్వ టీచర్లు టెట్ పరీక్ష రాయాల్సిందే : ఈ మధ్యనే తెలంగాణలో టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. టెట్ పరీక్ష అనేది..ఉపాధ్యాయ పరీక్షలు రాసేవారికి అర్హత పరీక్ష. టెట్ పరీక్షలో క్వాలిఫై అయితేనే రాష్ర్టంలోని ఏ ప్రభుత్వ ఉపాధ్యాయ పరీక్ష రాయడానికైనా అర్హత సాధిస్తారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా 'టెట్' పరీక్ష నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు ఏం చేయాలా? అన్న సందిగ్ధంలో ఉందంట..! అదేంటి వారంతా టెట్ పరీక్ష రాసే కదా.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. మళ్లీ వారికి ఈ పరీక్ష ఏంటీ.. అనుకుంటున్నారా? టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి 'టెట్' అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ, పదోన్నతుల ప్రక్రియపై స్టే ఇంతకుమునుపే స్టే విధించింది.

రాష్ట్రంలోని టీచర్ల సంఖ్య : అయితే, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు.
మూడేళ్లలో టెట్ అర్హత..తప్పనిసరి : మూడేళ్లలో ప్రభుత్వ ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్ అర్హత పొందేలా చూడాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది. అందులో టెట్‌కు సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తాత్కాలికంగా నిలిచిపోయిన పదోన్నతుల ప్ర్రక్రియ : ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2011 ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్ ముడిపడి ఉంది. అయితే, ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఏ చేస్తుందో వేచి చూడాల్సిందే..












Click it and Unblock the Notifications