పరీక్షలకు హాజరైతే చాలన్నట్లు విద్యార్థుల పరిస్థితి: గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
హైదరాబాద్: విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపైనా ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రేపు పరీక్షలున్నాయి.. శ్రద్ధగా చదవి రాయండి అంటే.. ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్ అవుతున్నాయని విద్యార్థులు అడుగుతున్నారని.. ఇది జోక్ కాదు.. వాస్తవమని గవర్నర్ తెలిపారు. శనివారం జరిగిన హైదరాబాద్ జేఎన్టీయూ స్నాతకోత్సవానికి ఛాన్సలర్ హోదాలో ఆమె అధ్యక్షత వహించారు.
విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలని, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాల్లో తీరని విషాదం నింపొద్దని గవర్నర్ తమిళిసై సూచించారు. సమాజంలో ఇప్పటికీ లింగ వివక్ష ఉందన్నారు. కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరిలో ఓ కార్యక్రమానికి వెళ్లే అక్కడ ఓ విద్యార్థి.. గవర్నర్‌గా మహిళలుంటారా? అని ప్రశ్నించాడని తెలిపారు.

నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లపై విపరీతంగా ఆధారపడుతున్నారని.. దాని నుంచి బయటపడాలన్నారు గవర్నర్ తమిళిసై. పరీక్ష బాగా రాశావా? అని ఒక విద్యార్థిని ప్రశ్నిస్తే.. మూడు గంటలపాటు సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చాడని తెలిపారు. పరీక్షలకు హాజరైనందుకు విద్యార్థులకు కృతజ్ఞతలు చెప్పే పరిస్థితి వచ్చిందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు హైదరాబాద్ చిరునామాగా మారుతోందన్నారు. జేఎన్టీయూ గౌరవ డాక్టరేట్ ను స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మైక్రో సెకన్లలో మార్పులు వస్తున్నాయని, వీటికి అనుగుణంగా విద్యార్థులు పరిశోధనలపై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా, ఈ స్నాతకోత్సవంలో 92వేల 5 మందికి డిగ్రీలు ప్రదానం చేశామని, వీరిలో 149 మంది పీహెచ్‌డీలు, 46 మంది గోల్డ్ మెడల్స్ పొందారని జేఎన్టీయూ వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications