బీజేపీ కార్యకర్తలా.. గవర్నర్ తమిళిసై కామెంట్లపై మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌పై అధికార పార్టీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. నిన్న ఆమె ఢిల్లీలో ప్రోటోకాల్ గురించి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి జగదీశ్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తమిళిసై సౌందర్ రాజన్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తుందని మంత్రి ఆయన ఆరోపించారు. తమిళిసై గవర్నర్‌లా ఉండకుండా.. రాజకీయ నాయకురాలిగా మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ రాష్ట్ర, కేంద్ర రాజకీయాలపై గవర్నర్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్‌భవన్ కేంద్రంగా మారుతుందని మంత్రి కామెంట్ చేశారు.

సంపద పెంపు..
ఇటు కాంగ్రెస్ నేతల కామెంట్లపై కూడా జగదీశ్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. రాష్ట్రం అప్పులకుప్పలా మారిందనే ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ పెంచుతున్నారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు. కేంద్ర తప్పుడు విధానాలతో దేశ ప్రజల తలసరి ఆదాయం తగ్గిందని తెలిపారు. వార్తల్లో ట్రెండింగ్ కావడం కోసం ప్రతిపక్ష నాయకులు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడటానికి ఏమీ లేక కేసీఆర్‌పై నోరు పారేసుకుంటున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

కేంద్ర అప్పుల సంగతి..
మోడీ ప్రభుత్వం అప్పుల మీద పార్లమెంటులో మాట్లాడకుండా, రాష్ట్ర అప్పులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. ఈడీ, సీబీఐ అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారు. విలీన గ్రామాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. ఏడు మండలాలను బీజేపీ కుట్రతో ఆంధ్రాలో విలీనం చేసిందన్నారు. అక్కడి ప్రజలు రెండు రాష్ట్రాల అభివృద్ధిని బేరీజు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. భౌగోళికంగా ఉన్న ప్రజల అభ్యంతరాలపై ఆలోచించాలని మంత్రి సూచించారు.

అవగాహన లేకుండా
కాళేశ్వరం ఎక్కడుందో.. భద్రాచలం ఎక్కడుందో తెలియకుండా సీఎం రమేష్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వరద నీటితో ప్రాజెక్ట్ పైభాగం లేక కింది భాగం మునుగుతుందో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. అవగాహన లేమితో కామెంట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు.












Click it and Unblock the Notifications