చరిత్ర రాస్తా: బీఆర్ఎస్ మంత్రులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కౌంటర్
హైదరాబాద్: తనపై ఇటీవల రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తనదైన శైలిలో స్పందించారు. తనకు రాజకీయాలంటే ఇష్టమని.. అందుకే తాను వైద్య వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. గవర్నర్ తమిళిసై రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ మంత్రులు ఆరోపించిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు స్పందించడం గమనార్హం.
రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే ప్రజలు విశ్వసిస్తారని తమిళిసై వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ నేతగా.. ఇప్పటికీ తనపై పువ్వులు వేసే వారున్నారని.. అలాగే రాళ్లు వేసేవారు కూడా ఉన్నారని చెప్పారు. రాళ్లు వేస్తే తాను వాటితో భవంతిని నిర్మిస్తానని అన్నారు. తనపై పిన్స్ వేస్తే.. ఆ పిన్స్ గుచ్చుకుని వచ్చే రక్తంతో తన చరిత్ర పుస్తకం రాస్తానని వ్యాఖ్యానించారు.

అందరూ అందరికీ నచ్చాలని లేదన్నారు గవర్నర్ తమిళిసై. ఓ నేతగా విమర్శలు ఎలా స్వీకరిస్తామనేదానిపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తానని తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఒకప్పుడు తాను బీజేపీ నేతనని.. ఇప్పుడు గవర్నర్‌ని అని చెప్పారు.
మరోవైపు, పార్లమెంటులో పాస్ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంపై గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా ప్రధాని మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ అని.. ఇప్పుడు బిల్లు ఆమోదంతో మహిళలు కూడా తమదైన ముద్ర వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను గవర్నర్‌గా వచ్చినప్పుడు ఒక్క మహిళా మంత్రి లేరని.. ఇప్పుడు ఇద్దరు మంత్రులు అయ్యారని తెలిపారు. ఒకప్పుడు తాను బీజేపీ నేతగా ఉన్నానని.. ఇప్పుడు గవర్నర్ అయ్యానని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications