ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ప్రకటనకు సిద్దం..!!
ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతోంది. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు నిరీక్షిస్తున్న పీఆర్సీ నియామకంతో పాటుగా ఐఆర్ ప్రకటనకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. పెండింగ్ డీఏలపైనా నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాల పైన నిర్ణయాలు ప్రకటించేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆసక్తి పెరుగుతోంది.
ఉద్యోగులకు వరాలు:తెలంగాణ ఎన్నికలకు మరో పది రోజుల్లో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, ప్రభుత్వం వచ్చే వారం కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది. అందులో భాగంగా ఉద్యోగుల పెండింగ్ అంశాలపైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని భావించినా.. ముఖ్యమంత్రి స్వల్ప అస్వస్థత కారణంగా వచ్చే వారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగుల పీఆర్సీ నియామకం దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగుల వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చైర్మన్‌గా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ సలహాదారు శైలేంద్రకుమార్ జోషిని ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

పీఆర్సీ ఛైర్మన్ ఖరారు:పీఆర్సీ ఛైర్మన్ గా పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పేర్లు పరిశీలించారు. సర్వీసులో ఉన్న కొంత మంది అధికారుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉండి, వివాదరహితుడైన వ్యక్తిని ఎంపిక చేయాలంటూ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మకు సూచించారు. దీంతో ఆయన కూడా పలువురి పేర్లను పరిశీలించి, సౌమ్యుడు, వివాదాస్పదం కాని వ్యక్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో జోషిని ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు తెలిసింది. చైర్మన్‌గా తనను నియమించాలంటూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కూడా ప్రయత్నించినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. త్వరలో పీఆర్సీ ఏర్పాటు ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం.

కీలక నిర్ణయాల దిశగా:ఇక, పీఆర్సీతో పాటుగా ఉద్యోగులకు మధ్యంతర భృతి పైనా ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు మధ్యంతర భృతి అమలు చేయనున్నారు. ఇదే సమయంలో పెండింగ్ డీఏల గురించి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి పలు సందర్భాల్లో కోరాయి. ఇప్పుడు ఒక పెండింగ్ డీఏను విడుదల చేయటంతో పాటుగా పీఆర్సీ నియమాకం.. మధ్యంతర భృతి ప్రకటనకు కేబినెట్ లో ఆమోదం చెబుతారని తెలుస్తోంది. దీంతో పాటుగా ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) పైనా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. దీంతో, వచ్చే కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు వరాలతో పాటుగా సామాన్య ప్రజలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ఉంటాయనే సమాచారంతో..ప్రభుత్వ నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications