ఎమ్మెల్సీ పోలింగ్ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మే 27న ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మే 27 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రైవేటు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేనందున తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో వికాస్ రాజ్ సూచించారు. ప్రైవేటు కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిప్టులు సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీఈవో తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మూడు పార్టీలు కూడా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు.
కాగా, 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52మంది అభ్యర్థులు ఉన్నారు.












Click it and Unblock the Notifications