తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యం: ఎందుకో చెప్పిన గుత్తా సుఖేందర్ రెడ్డి!!
తెలంగాణ రాష్ట్రంలో అప్పడే ఎన్నికల వేడి కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో కూడా కర్ణాటక తరహా రిజల్ట్ వస్తుందని భావిస్తుంటే, బిజెపి తెలంగాణలో దూకుడు పెంచి, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని ప్రయత్నం చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలకు స్థానం లేదని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెబుతున్నారు. తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే శరణ్యం తప్ప మరొకటి లేదనే భావనలో ప్రజలున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

నల్గొండలోని తన నివాసంలో జరిగిన మీడియా సమవేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వంతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలు వందశాతం నమ్ముతున్నారని ఇందుకు ప్రస్తుత రాజకీయ పరిణామాలే తాజా ఉదాహరణ అని అన్నారు. కర్ణాటక ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచినా అంతర్గత కుమ్ములాటలతో సీఎంను ఎన్నుకునే పరిస్థితి లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి ఒక్క ఓటు వేసినా రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలౌతుందని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాతైనా బీజేపీకి జ్ఞానోదయం కలగడంలేదని, మతోన్మాద బీజేపీకి, కుమ్ములాటలతో మారని కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ, బిజెపి లకు తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ లేదని, వారికి అధికారం అందని ద్రాక్ష అని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ వంద సీట్లలో విజయం సాధిస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై వ్యాఖ్యలు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గత రెండు పర్యాయాలు తాము కమ్యూనిస్టుల మద్దతు లేకుండానే సంపూర్ణ మెజార్టీతో విజయం సాధించామని, ఈసారి కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.
తాము విజయం సాధించాలంటే లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయి అని, కెసిఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని బి ఆర్ ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications