
హాజీపూర్ వరుస హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు.. సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష
హాజీపూర్ వరస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ పోక్సో (Pocso) కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చిన కేసులో దోషిగా తేల్చింది. శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చారని ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలతో ఏకీభవించింది. నిందితుడి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. విచారణ క్రమంలో ప్రాసిక్యూషన్ 101 మంది సాక్షులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సాక్షులే కాదు.. సైంటిఫిక్ ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు.

దోషిగా నిర్ధారణ
నిందితుడు శ్రీనివాస్ రెడ్డితో జడ్జి మాట్లాడారు. మూడు హత్య కేసులో నేరాభియోగం రుజువైందని న్యాయమూర్తి అనగా.. తాను తప్పు చేయలేదని నిందితుడు రోదించాడు. కావాలనే తనను ఇరికించారని వాపోయాడు. మూడు హత్య కేసులతో తనకు సంబంధం లేదని నిందితుడు తెలిపాడు. తనను వదిలేయాలని తల్లిదండ్రులను చూసుకోవాలని జడ్జిని అభ్యర్థించాడు. పేరెంట్స్‌కు ఎవరూ లేరని.. తన ఇల్లును కూడా కూల్చివేశారని తెలిపారు. నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలుసా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు తెలియదని సమాధానం ఇచ్చాడు.

లిప్ట్ ఇస్తానని చెప్పి..
గతేడాది మైనర్ బాలికలకు శ్రీనివాస్ రెడ్డి లిప్ట్ ఇస్తానని చెప్పి.. తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడి చేసి.. దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం ఫోక్సో పాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది సైకో శ్రీనివాస్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు బాలికల మృతదేహలు వ్యవసాయ బావిలో కనిపించాయి.

101 సాక్షులు
పోలీసులు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. కేసులో జూలై 31వ తేదీన చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత అక్టోబర్ 14వ తేదీ నుంచి కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. లైంగికదాడి హత్యకు సంబంధించి 101 మంది సాక్షులను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. నిందితుడు సైకో శ్రీను ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫున బలంగా వాదించారు.

స్మార్ట్ పోన్ లేదు...?
కోర్టులో వాదనలు జరిగే సమయంలో.. జనవరి 3వ తేదీన నిందితుడుతో మేజిస్ట్రేట్ మాట్లాడారు. కోర్టులో మేజిస్ట్రేట్, శ్రీనివాస్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మొబైల్‌లో ఆశ్లీల సినిమాలు, ఫొటోలు ఉన్నాయని అడిగితే తనకు స్మార్ట్ ఫోన్ లేదని చెప్పారు. మృతురాలి డ్రెస్సులపై స్పెర్మ్ ఉందని అడిగితే తనను పోలీసులు నిర్బంధించి సిరంజి ద్వారా సేకరించారని చిలకపలుకులు పలికారు.

మగాడినే కాదు..
బాలికలను బైక్‌పై తీసుకెళ్లి లైంగికదాడి చేయడమే గాక బావిలో పూడ్చి పెట్టావని నిలదీస్తే.. తాను నపుంసకుడినని.. అలాంటప్పుడు లైంగికదాడి ఎలా చేస్తానని చెప్పి జడ్జీనే విస్మయానికి గురిచేశాడు. తనకు బైక్ నడపడం కూడా రాదని కలరింగ్ ఇచ్చాడు.