గవర్నర్ తమిళిసైపై మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు: బీజేపీపై విమర్శలు
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. గజ్వేల్‌కు రావాల్సిన ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లును గవర్నర్ అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ కక్షపూరితంగానే వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. సిద్దిపేటలోని రంగనాయకసాగర్ వద్ద బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్లినరీలో మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్రం వివక్షపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను గవర్నర్ తొక్కి పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. ఇక సీఎం కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఏర్పాటు మరో చరిత్ర కాబోతోందన్నారు. నేడు మనమంతా గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం సీఎం కేసీఆర్ పడిన శ్రమేనని అన్నారు.

తెలంగాణలో ఆకుపచ్చ చరిత్ర రాశారని, దీనికి ప్రదానం కాళేశ్వరమని చెప్పారు మంత్రి హరీశ్ రావు. ఉద్యమ జ్వాల కేసీఆర్ నేడు అభివృద్ధి జ్వాలగా మారరని తెలిపారు. దేశంలో అత్యధికంగా వరి సాగవుతున్నది తెలంగాణలోనేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలోనే 57 లక్షల ఎకరాల్లో వరి పండుతుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం అందని ఇల్లు లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం మూగ జీవాలకు కూడా గ్రాసం లేని దుస్థితి ఉండేదని.. నేడు ఐదారు రాష్ట్రాలకు తిండిపెట్టే ధాన్యం తెలంగాణ రైతులు పండిస్తున్నారన్నారని చెప్పారు మంత్రి హరీశ్ రావు.
మన రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ నిధి పేరుతో కేంద్రం అమలు చేస్తున్నదని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను వేర్వేరు పేర్లతో అమలు చేస్తున్నదని హరీశ్ రావు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రగతిని ఢిల్లీలో మెచ్చుకుంటారని, ఇక్కడికి వచ్చిమాత్రం తిడతారని విమర్శించారు. మోడీ తప్పులను ఎత్తి చూపితే తిడతారా? అని ప్రశ్నించారు. అడిగితే ఈడీలు, ఐటీలు, సీబీఐ లను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడికిపోయినా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ మీద ఉండే ప్రేమ.. మోడీకి ఉంటుందా, రాహుల్ గాంధీకి ఉంటుందా? అని అన్నారు. సీఎం కేసీఆర్‌ను తిడితే సూర్యుడిపై ఉమ్మి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications