కేసీఆర్, కేటీఆర్‌ను ఇరికించింది హరీశ్ రావే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లీజు అంశంపై విచారణ జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి హరీశ్ రావు తన మామ కేసీఆర్, బామ్మర్ది కేటీఆర్‌ను ఇరికించేందుకే ఓఆర్ఆర్ టోల్ లీజ్‌పై సిట్ వేయాలని అడిగారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. హరీశ్ రావు అసెంబ్లీలో కోరడంతోనే సీఎం రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారన్నారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో దొంగలు దొరికారని మంత్రి చెప్పారు. ఓఆర్ఆర్ టోల్ లీజ్‌లో అవకతవకలు కూడా బయటపడతాయన్నారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు కేసులో ఒకరో ఇద్దరో జైలుకి పోతారని, ఓఆర్ఆర్ ఎపిసోడ్‌లో కూడా జైలుకి వెళతారన్నారు. ఆర్ఆర్‌ఆర్‌కి ఆరేళ్లు ఆలస్యమైందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

ఇప్పుడు టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందన్నారు. మార్చిలో ఆర్ఆర్ఆర్ పనులు ప్రారంభమవుతాయన్నారు.ఆర్ఆర్ఆర్ కోసం ఢిల్లీలో ఉండి ఎంతో కృషి చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టుకు తమ కృషి వల్ల ముందడుగు పడిందన్నారు. ఆర్ఆర్ఆర్ మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, దీనికి సహకరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
టెండర్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్ఆర్ఆర్ పనులకు కీలక ముందడుగు పడినట్లయిందన్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు కృషి చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ అభినందించారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు. అందుకు కోమటిరెడ్డి బదులిస్తూ.. మీ చొరవ, కృషి, సహకారం, సలహాలతోనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందని రేవంత్ రెడ్డిని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications