Omicron వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ, కానీ..: కరోనా కట్టడిపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ వైరస్ కేసులతోపాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా రోగుల వైద్యం కోసం అదనపు పడకలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐసీయూ వార్డును మంత్రి హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు.

ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువే కానీ.. : హరీశ్ రావు
తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో పడకలను పెంచుతున్నామని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా.. దాని తీవ్రత తక్కువేనని తెలిపారు. అలా అని ఈ వేరియంట్ పట్ల నిర్లక్ష్యం వహించకూడదన్నారు. కరోనా కేసుల వైద్యం కోసం అదనపు పడకలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ట్టుకునేలా.. : హరీశ్ రావు
కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకొనే విధంగా 1400 పడకలు హైద్రాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్‌లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6 ఆస్పత్రుల్లో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఇందులో భాగంగా వనస్థలిపురంలో 100 పడకలు ఏర్పాటు చేశామన్నారు. అయితే ప్రజలందరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. 24 లక్షల హోం ఐసోలాషన్ కిట్లను అందుబాటులో ఉంచుకున్నామని, పేదల వైద్యం మీదా ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్రం ప్రకటన చేసిందని హరీశ్ రావు తెలిపారు.

కరోనా నిబంధనలతోనే పండగలు: హరీశ్ రావు
పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాల ఇచ్చారని, ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రానున్నట్లు, దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు. మన బస్తీ దవాఖానా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. మున్సిపాలిటీలో కూడా బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ దృష్టిలో పెట్టుకొని అదనంగా వైద్యులను ఇక్కడ ఏర్పాటు చేశామని, రెండు డోసులు కోవిడ్ వాక్సిన్ అందరూ తీసుకోవాలన్నారు. మాస్కులు తప్పకుండా ధరించాలని, కొంచెం వ్యాధి లక్షణాలున్నా పరీక్షలు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనాలని హరీశ్ రావు సూచించారు.












Click it and Unblock the Notifications