తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడలేదేం: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడు కూడా తెలంగాణ కోసం నోరు మెదపలేదన్నారు.
విమర్శలు చేసేవారు ఎప్పుడూ ఉంటారని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన కొందరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని బుధవారం అన్నారు. ప్రతి విషయంలోను విమర్శలు చేసేవారు ఎప్పుడూ ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు.

పోతిరెడ్డిపాడు పైన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు వారు ఎందుకు పెదవి విప్పలేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రైతులకు నీరు అందిస్తామన్నారు.
ప్రజలకు, వ్యవసాయానికి నీరు అందించేందుకు చేపడుతున్న ప్రాజెక్టుల పైన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. కొందరు నేతలు తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణను ముంచి రాయలసీమకు నీరు ఇస్తే కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉండిపోయారన్నారు.
సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు కూడా తెలంగాణకు ఇచ్చేందుకు, వైయస్ చంద్రబాబు మనసు అంగీకరించలేదన్నారు. సంక్షేమ కార్యక్రమాల పైన ప్రతిపక్షాల విమర్శిస్తే పట్టించుకోమన్నారు. సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications