ఆంధ్రా ప్రాజెక్టులను ఎత్తి చూపి.. విపక్షాలను కడిగేసిన హరీశ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : గతకొద్ది రోజులుగా వివాదస్పదమవుతోన్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివాదానికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు మంత్రి హరీశ్ రావు. గత పాలకుల హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, ప్రస్తుతం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతోన్న పలు ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం ప్రజాస్వామ్యం బద్దంగానే భూసేకరణకు సిద్దమవుతోందని సోదాహరణలతో సహా స్పష్టం చేశారు.

మల్లన్న సాగర్ వివాదంలో విపక్షాల ఆందోళన అప్రజాస్వామికం అన్న హరీశ్ రావు.. గత పాలకుల పనితీరును ఎండగడుతూనే ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రా ప్రభుత్వాలు అనుసరిస్తోన్న పంథా కన్నా తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తోందని వివరించారు.

Also Read: తెలంగాణలో పోలీసుల లాఠీచార్జ్, గ్రామస్తులు రాళ్లతో తరిమికొట్టారు (పిక్చర్స్)

లెక్కలతో సహా కాంగ్రెస్ ను కడిగిపారేశారు :

మల్లన్న సాగర్ విషయంలో గగ్గోలు పెడుతోన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి.. కర్నాటకలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం లక్షా 25వేల ఎకరాలను సేకరిస్తోన్న విషయం కనపడడం లేదా అని నిలదీశారు హరీశ్ రావు. ముఖ్యంగా పులిచింతల ప్రాజెక్టు విషయంలో సీఎల్పీ నేత జానారెడ్డి తీరును తప్పుబట్టారు హరీశ్.

Harish Rao very clearly explained govt stand on Mallanna sagar issue

సీఎం కేసీఆఆర్ చేపట్టిన రీడిజైనింగులతో.. 50 టీఎంసీల కోసం అతి తక్కువ ముంపుతో కేవలం 8 గ్రామాలే ముంపుకు గురవుతుంటే.. గత పులిచింతల ప్రాజెక్టు కోసం 45 టీఎంసీల నీళ్లకే 28 గ్రామాలను ముంపుకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఆంధ్రా ప్రాంతానికి మూడో పంట కోసం పులిచింతల కడుతుంటే.. మంత్రిగా దగ్గరుండి మరీ ఆంధ్రా ప్రాజెక్టులకు సహకరించిన జానారెడ్డి ఈనాడు ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసం అన్నారు.

ఓవైపు ఒక పంటకే దిక్కు లేక తెలంగాణ రైతులు బాధపడుతుంటే.. మూడో పంట కోసం ఆంధ్రా పాలకులు నీటిని మళ్లించుకుపోతున్నా.. తమ స్వంత నియోజక వర్గాల్లో గ్రామాలను సైతం త్యాగం చేసిన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉండి కూడా ఏం చేయలేకపోయారన్నారు. ఈనాడు మల్లన్న సాగర్ ద్వారా నల్లగొండలో 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటే మాత్రం ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు హరీశ్.

వైఎస్ హయాంలో చిన్న సన్నకారు రైతులు, దళిత రైతుల నుంచి వ్యాన్ పిక్ కోసం 16వేల ఎకరాలను సేకరిస్తే.. అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న దామోదర రాజనరసింహ, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న భట్టి విక్రమార్క ఎందుకు అడ్డుపడలేదని ప్రశ్నించారు. అనుభవజ్ఞులు, సీనియర్ నేత అయిన జైపాల్ రెడ్డి కూడా ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని విమర్శంచాలని చూడడం సరికాదన్నారు.

Harish Rao very clearly explained govt stand on Mallanna sagar issue

టీడీపీ నేతలు సమాధానం చెప్పండి..

ఇక మల్లన్న సాగర్ విషయంలో.. గల్లీలో ఓ మాట, ఢిల్లీలో ఓ మాటతో టీడీపీది రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు హరీశ్. ఢిల్లీలో 2013 భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలనే టీడీపీ ఎంపీలు ఇక్కడ మాత్రం అదే చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారన్నారు. ప్రభుత్వం రైతుల అభిప్రాయం మేరకే వ్యవహరిస్తుందని, వాళ్లు కోరుకుంటే.. భూసేకరణ చట్టం 2013 ప్రకారమే సేకరణ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.

ఇక ఆంధ్రా ప్రభుత్వం చేపడుతోన్న భూసేకరణల గురించిన ప్రస్తావించిన హరీశ్.. అమరావతి రింగ్ రోడ్డు కోసం 4800 ఎకరాలు, మచిలిపట్నం పోర్టు కోసం 1500 ఎకరాలు, వ్యాన్ పిక్ కోసం 16వేల ఎకరాలు, గన్నవరం ఎయిర్ పోర్ట్ కోసం 2500 ఎకరాలు, నెల్లూరు ఎస్సీజడ్ 12వేల ఎకరాలు.. ఇలా లక్షల ఎకరాల భూములను అక్కడి ప్రభుత్వం ప్రజల వద్ద నుండి లాక్కుంటే తప్పు లేదు గానీ, తెలంగాణ సస్యశ్యామలం అవడం కోసం మల్లన్న సాగర్ నిర్మిస్తే మాత్రం టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు.

ఆంధ్రాలో ఏటా రెండు మూడు పంటలు పండే భూములను అక్కడి ప్రభుత్వం ఇండస్ట్రియలిస్టుల కోసం కట్టబెట్టడానికి భూసేకరణ జరుపుతుంటే.. ఇక్కడి ప్రభుత్వం తెలంగాణ రైతులు రెండు పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో, తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చాలనే ప్రయత్నంతో మల్లన్న సాగర్ భూసేకరణ జరుపుతుందన్నారు హరీశ్.

నిజానికి 500 ఎకరాలు సరిపోయే రాజధానికి.. 54వేల ఎకరాలు సేకరించడం ఒక్క ఆంధ్రాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. లోక్ సభలో భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని ఓటు వేసే టీడీపీ నేతలు.. ఇక్కడికొచ్చి మాత్రం అదే చట్టాన్ని అమలు చేయాలనడం విడ్డూరం అన్నారు హరీశ్.

Harish Rao very clearly explained govt stand on Mallanna sagar issue

కమ్యూనిస్టులదీ అదే తీరు :

పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టుల పాలన కొనసాగిన రోజుల్లో.. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఓ ఇండోనేషియా కంపెనీకి 10వేల ఎకరాలు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్దపడితే.. 14 మంది రైతులు చనిపోయిన మాట వాస్తవం కాదా.. అని సీపీఐ, సీపీఎం నేతలను సూటిగా ప్రశ్నించారు హరీశ్.

ఎందుకు రీడిజైనింగ్స్..?

రీడిజైనింగ్స్ పట్ల ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను ఖండించిన మంత్రి హరీశ్ రావు లెక్కలతో సహా ఆయా ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. 115 టీఎంసీల కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 32 గ్రామాలు మునిగేలా గత పాలకులు డిజైన్ రూపొందిస్తే..! తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 ముంపు గ్రామాలతో 92 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును రీడిజైన్ చేసిందన్నారు.

ఇక గత పాలకులు నిర్మించిన పులిచింతల కేవలం 48 టీఎంసీల కోసం 28 గ్రామాలను.. 21 టీఎంసీల కోసం నిర్మించిన ఎల్లంపల్లి కింద 21 గ్రామాలను.. 25 టీఎంసీల కోసం నిర్మించిన మిడ్ మానేరు కింద 21 గ్రామాలను మునిగిపోయేలా డిజైన్లు రూపొందించారని.. టీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన మల్లన్న సాగర్ లో 50 టీఎంసీల కింద కేవలం 8 గ్రామాలే ముంపుకు గురువతున్నాయన్న విషయాన్ని హరీశ్ రావు వెల్లడించారు.

మల్లన్న సాగర్ అవసరమా..? అని మాట్లాడుతున్న నేతలు ఆనాడు పులిచింతల అవసరమా..? అని ఎందుకు ప్రశ్నించలేదన్నారు హరీశ్. మూడో పంట కోసం పులిచింతల కడితే లేని అభ్యంతరం.. తెలంగాణలో బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు నిర్మిస్తోన్న మల్లన్న సాగర్ విషయంలో మాత్రం ఎందుకు అని నిలదీశారు.

రిటైర్డ్ ఇంజనీర్లు, మేథావులతో రోజుల తరబడి చర్చలు జరిపాకే.. అతి తక్కువ ముంపు ఉండేలా సీఎం కేసీఆర్ రీడిజైనింగ్స్ ను ప్లాన్ చేశారన్నారు. సముద్రంలో కలిసిపోయే 800 టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా వినియోగంలోకి తెస్తే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు.

ఇప్పటికే ఆరు గ్రామాల ప్రజలు భూసేకరణకు ఒప్పుకున్నారని,ప్రతిపక్షాలు ధర్నాలు చేసిన టెంట్ల కింద మంగళవారం నాడు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని తెలిపారు హరీశ్. రాష్ట్ర సాధనలో ఎలాగు కలిసి రాలేదు.. కనీసం అభివృద్ది విషయంలోనైనా ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Harish Rao very clearly explained govt stand on Mallanna sagar issue with the particulars of the project by comparing previous govt projects.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి