సంధ్య థియేటర్ ఘటనపై హరీశ్ రావు హాట్ కామెంట్స్
సంధ్య థియేటర్ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు.
హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, నవీన్ రావు తదితరులు ఆస్పత్రికి చేరుకుని బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారని చెప్పారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు మనోధైర్యం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించినట్లు హరీశ్ రావు తెలిపారు. మృతి చెందిన రేవతి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. తాను మరణిస్తున్నా.. కొడుకు శ్రీతేజ్‌ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశామని అన్నారు. రేవతి అందరి మనసు కరిగేలా చేసిందన్నారు.
సంధ్య థియేటర్ ఘటనను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం రేవంత్, మంత్రులు స్పందించారన్నారు. సినిమా వాళ్లను భయపెట్టి సీఎం మంచి చేసుకోకూడదని అన్నారు. గురుకులాల్లో మృతి చెందినవారి కుటుంబాలను సీఎం రేవంత్ పరామర్శించిన దాఖలాలు లేవన్నారు.
రాష్ట్రంలో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే.. అందుకు కారణమైన సీఎం తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమన్న సీఎం.. వాళ్ల తమ్ముడిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హరీశ్ రావు నిలదీశారు. రేవంత్ సోదరులను కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా పిలవరా? అని మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసని హరీశ్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications