Hattrick Loading 3.0: సంబరాలకు సిద్ధం కావాలంటూ తుపాకీ గురిపెట్టిన కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటల ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తమ ధీమాను మరోసారి వ్యక్తం చేశారు. ఆదివారం విడుదల కానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. డిసెంబర్ 3వ తేదీన రానున్న ఎన్నికల ఫలితాల్లో గెలిచేది తామేనని.. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ మేరకు శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు కేటీఆర్. 'హ్యాట్రిక్ లోడింగ్ 3.O' అంటూ గన్‌తో గురిపెట్టిన ఫొటోను కేటీఆర్ పంచుకున్నారు. అంతేగాక, ఆదివారం సంబురాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాగా, ఎగ్జిట్ ఫలితాలను బీఆర్ఎస్ తారుమారు చేస్తుందని ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే. ఎగ్జిట్ ఫలితాలను నమ్మాల్సిన పనిలేదన్నారు.

ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేమీ కాదు. డిసెంబర్ 3న 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తాం. ఎగ్జిట్ పోల్స్‌ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైంది.' అని మంత్రి కేటీఆర్ తేల్చేశారు.
Hattrick Loading 3.0 👍
— KTR (@KTRBRS) December 2, 2023
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నారని.. అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడటమేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ డిసెంబర్ 3న ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్ పోల్స్ ప్రచురించిన మీడియా సంస్థలను ప్రశ్నించారు.
ఎవ్వరూ కన్ఫ్యూజన్ కావద్దని.. వందకు 100 శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత 90 రోజులుగా కష్టపడ్డ మా కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా గంట, గంటన్నర సేపు పోలింగ్ జరిగేది ఉందని.. 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ఇంకా పోలింగ్ శాతం తేలలేదని.. ఫైనల్ పోలింగ్ ఎంత జరిగిందనేది రేపు ఉదయం తేలుతుందని తెలిపారు. ఎంత పోలింగ్ అయ్యింది.. ఎక్కడ ఎంత అయ్యింది.. ఏ నియోజకవర్గంలో ఎంత అయ్యిందనేది అనాలసిస్ చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications