అయ్యో బిడ్డా.. పెన్సిల్ అక్కడ గుచ్చుకుని చిన్నారి మృతి..
చిన్నారులు ఆటల్లో పడితే అన్నింటినీ మర్చిపోతారు. స్నేహితులతో సరదాగా ఆడుతున్న సమయంలో వాళ్లు ఆటలపైనే దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా ఓ ఆరేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరని ఈ విషాద ఘటన చూస్తే అర్థమవుతోంది. అప్పటివరకూ తమతో ఆడి పాడిన ఆ చిన్నారి ఇక లేడని తెలిసి తోటి హృదయాలు బరువెక్కాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి ఇలా అర్థాంతరంగా మృతి చెందడంపై ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగింది.
ఓ చిన్న పెన్సిల్ ప్రాణం తీస్తుందని ఎవరూ అనుకోరు. కానీ అదే జరిగింది. ఆ పెన్సిల్ చిన్నారిని నిండు నూరేళ్లు నిండకుండానే మృత్యు ఒడిలోకి తీసుకెళ్లింది. అప్పటి వరకూ పెన్సిల్ తో రాసిన ఆ చిన్నారి ఆటల్లో పడి మర్చిపోయి పెన్సిల్ ను జేబులో పెట్టుకున్నాడు. కానీ ఆ పెన్సిల్ ముక్కే తనకు మరణ శాసనం అవుతుందని అసలు ఊహించలేదు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. మేడారపు విహార్ అనే చిన్నారి వయసు ఆరేళ్లు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ లో యూకేజీ చదువుతున్నాడు. అప్పటి వరకూ పెన్సిల్ తో టీచర్ చెప్పిన పాఠాలు రాశాడు. అయితే పెన్సిల్ ను షర్ట్ జేబులో పెట్టుకుని ఫ్రెండ్స్ తో ఆటలు ఆడాడు. అలా ఆడుతూ ఆడుతూ విహార్.. ఒక్కసారిగా కింద పడ్డాడు. దీంతో అతడి జేబులోని పెన్సిల్ ప్రమాదవశాత్తూ విహార్ గొంతులోకి గుచ్చుకునిపోయింది.

దీంతో విహార్ గొంతుకు తీవ్ర గాయమైంది.. రక్తం కారసాగింది. ఒక్కసారిగా విహార్ కుప్పకూలాడు. అది గమనించి వెంటనే బాలుడ్ని 108 వాహనంలో కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ముక్కుపచ్చలారని చిన్నారి అకాల మరణంతో నాయకన్ గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications