హైదరాబాద్‌లో వర్షం, ఈదురుగాలుల బీభత్సం: నాలుగు విమానాల మళ్లింపు, కూలిన చెట్లు
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండవేడికి ఇబ్బందులు పడ్డ ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షాలతో ఉపశమనం లభించింది. అయితే, పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్‌లో వర్షం, ఈదురుగాలుల బీభత్సం
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్‌మెట్, కొండపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి కొత్తపేట ప్రాంతాల్లో వర్షం మోస్తరుగా కురిసింది. కూకట్‌పల్లి , కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్ నగర్, ప్రగతినగర్, నిజాంపేట్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటంతో వాహనాలు దెబ్బతిన్నాయి.

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం, ఈదురుగాలులు, కూలిన చెట్లు
మరోవైపు, చాంద్రాయణగుట్ట, బార్కాస్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి. మలక్‌పేట పరిధిలోని తీగలగూడలో ఈదురుగాలులతో ఓ చెట్టు బైక్‌పై పడింది. దీంతో బైక్ దెబ్బతింది. సాయంత్రం ఒక్కసారిగా వర్షం రావడంతో వాహనదారులంతా మెట్రో పిల్లర్ల కింద ఆగిపోయారు. వర్షం తగ్గిన తర్వాత వెళ్లారు. వర్షాలతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్‌కు వచ్చే విమానాల దారి మళ్లింపు
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నగరానికి వచ్చే నాలుగు విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ, ముంబై, విశాఖపట్నం, బెంగళూరు నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలను దారి మళ్లించినట్లు చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చే విమానాన్ని బెంగళూరుకు, బెంగళూరు నుంచి వచ్చే విమానాన్ని నాగ్‌పూర్‌కు, విశాఖపట్నం, ముంబై నుంచి వచ్చే విమానాలను విజయవాడ గన్నవరం విమానాశ్రయంకు మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లోనూ వడగండ్ల వర్షం, ఈదురుగాలులు
హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పటాన్‌చెరు, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, అమీన్పూర్ లో ఈదురుగాలులతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. వాహనదారులు కూడా తమ ప్రయాణాన్ని కొనసాగించలేకపోయారు. ముత్తంగి ఫ్లైఓవర్ వద్ద బ్యానర్లు చిరిగిపోయాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో వడగండ్ల వర్షం కురిసింది. ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో ఓ ఇంటిపైకప్పు ఎగిరిపోయింది.












Click it and Unblock the Notifications