భారీ వర్షాలతో తెలంగాణలో ఈసెట్ పరీక్ష వాయిదా: నిండుకుండలా హుస్సేన్ సాగర్
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం జరగాల్సిన ఈసెట్ పరీక్ష వాయిదా వేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అయితే, జులై 14 నుంచి ఎంసెట్ యథాతథంగా కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నిర్వహణఫై కన్వీనర్లు, సంబంధిత అధికారులతో ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సమీక్షించారు. జులై 13 వరకు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం, పలు ప్రాంతాల్లో వరద ఉధృతి ఉన్నందున ఈసెట్ వాయిదా వేయాలని నిర్ణయించారు.

ఈసెట్ మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని త్వరలో ఖరారు చేస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేదని ఆయన స్పష్టం చేశారు.
నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారిపోయింది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం కన్నా ఎక్కువగా వరదనీరు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 513.50 మీటర్లకు చేరింది. సాగర్ గరిష్ట నీటిమట్టం 514.75 మీటర్లు.
గరిష్ట నీటిమట్టానికి మరో మీటరు దూరంలో హుస్సేన్ సాగర్ లో నీరు ఉంది. సోమవారం కూడా వర్షం కొనసాగుతుండటంతో ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే తూముల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాలు భారీగా కురిస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, భారీ వర్షాల కారణంగా ఎంఎంటీఎస్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. పలు రైళ్లు కూడా రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications