హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: రోడ్లు జలమయం, మరో 3 రోజులు వానలే
హైదరాబాద్: నగరంలో పలు చోట్ల ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం దంచికొట్టింది. కూకట్‌పల్లి, మణికొండ, గచ్చిబౌలి, సుచిత్ర, కొంపల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఫిలింనగర్, పంజాగుట్ట, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, మెహదీపట్నం, కొండాపూర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
గత కొన్నిరోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రహదారులపై వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పాదచారులకు కూడా ఇక్కట్లు తప్పలేదు. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్ఎంసీ హెచ్చరించింది.

మరోవైపు హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇక ఇప్పటికే కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వరదనీటిలో కొట్టుకుపోతుంటే అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మరో మూడు రోజులపాటు వర్షాలే
తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ద్రోణి విదర్భ నుంచి మరఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.
రాగల మూడు రోజులపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ లనుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 39-41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications