భారీ నుంచి అతి భారీ వర్షాలు: సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: రాజధాని నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మరో మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కేటీఆర్ జీహెచ్ఎంసీ, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న మూడు రోజులపాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అన్ని శాఖలు సమన్వయంతో సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. జలమండలి, విద్యుత్ శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతోపాటు నిరంతరం సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని మంత్రి ఆదేశించారు.

ఇప్పటికే జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను కూడా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు కేటీఆర్‌కు తెలిపారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు, జలమయ్యే ప్రధాన రహదారుల్లో డీవాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కాగా, మంగళవారం సీఎస్ శాంతికుమారి కూడా వర్షాలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, హైదరాబాద్ నగరంతోటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, నారాయణ గూడ, హిమాయత్ నగర్, లక్డీకపూల్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షంతో ప్రజలు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.

మరోవైపు, మంగళవారం నుంచి తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో మూడు నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.












Click it and Unblock the Notifications