Seethakka-Namratha: సీతక్కతో నమ్రత.. వైరల్ అవుతోన్న ఫొటోలు..
కొద్ది రోజులు క్రితం భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ ప్రజలు వరదలతో తీవ్రంగా నష్టపోయారు. దీంతో మానవత్వంతో సినీ ప్రముఖులు వరద బాధితులకు సాయం ప్రకటించారు. ప్రకటించిన సాయాన్ని అందించడానికి ఒక్కొక్కరుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్తున్నారు. చెక్కులు అందజేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిసి చెక్ అందించారు. అలాగే బాలకృష్ణ చిన్న కూతురు కూడా ముఖ్యమంత్రి చెక్ అందించారు. ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్ కూడా వరద బాధితుల సహాయం నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా మహేశ్ బాబు దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితులకు ప్రకటించిన సాయం రూ.50 లక్షల చెక్కును ఇచ్చారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఇంట్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ ఉన్నారు. మంత్రిని చూడగానే మహేశ్ బాబు భార్య నమ్రత సీతక్క వద్దకు వెళ్లారు. సీతక్కను అభినందించారు. తాను కూడా మీ అభిమానినేనంటూ మాట్లాడారు. ఇద్దరు కలిసి ఫొటోలు దిగారు. వీరు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సీతక్క, నమ్రతను అభినందిస్తున్నారు.

ములుగు ఎమ్మెల్యేగా సీతక్క అనేక సేవలు అందించారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కాలి నడక నడుచుకుంటూ వెళ్లి గిరిజనులకు నిత్యావసర సరకులు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది సీతక్క ఫ్యాన్స్ అయిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీతక్కకు పంచాయితీ రాజ్ శాఖ వచ్చింది. ఆమె పుట్టి పెరిగింది గూడాలు, పల్లెల్లోనే కాబట్టి ఆమెకు పంచాయతీ రాజ్ శాఖ ఇచ్చినట్లు చెప్పుకున్నారు.
సీఎం సహాయ నిధికి సినీ ప్రముఖులే కాకుండా వ్యాపారవేత్తలు కూడా విరాళం ప్రకటించారు. వారందరూ ఒక్కొక్కరిగా వచ్చి చెక్కులు అందజేస్తున్నారు. అయితే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు మాత్రం తెలుగు రాష్ట్రాలకు రూపాయి కూడా విరాళం ప్రకటించలేదు. కానీ చిన్న హీరోయిన్ అయిన అనన్య నాగళ్ల తనకున్నంతలో విరాళం ప్రకటించారు. దీంతో ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications