ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు ఊరట
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, రాధా కిషన్ రావుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. పిటిషన్‌పై తదుపరి విచారణ చేపట్టే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చింది.
తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్ రావు వద్ద గతంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో అరెస్ట్ చేయొద్దని గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనల కోసం న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వస్తారని పీపీ తెలిపారు. మరో కేసులో లూథ్రా బీజీగా ఉన్నందున వాదనలకు పీపీ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇటీవలే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు పీఏను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు పీఏ వంశీకృష్ణతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలతో వంశీకృష్ణతోపాటు సంతోష్ కుమార్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు.
చక్రధర్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ డబ్బులు వసూలు చేశారని ముగ్గురు నిందితులపై ఆరోపణలు ఉన్నాయన్నారు. కేసులో ఏ1గా హరీశ్ రావు, ఏ2గా రాధాకృష్ణన్ రావు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో చక్రధర్ గౌడ్ ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు కలిసి ఓ రైతు గుర్తింపు కార్డులతో సిమ్ కార్డు కొనుగోలు చేసి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలున్నాయి.
అంతేగాక, గతంలో ఆరోగ్యశ్రీ శాఖలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు హరీశ్ రావు పీఏ వంశీకృష్ణపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీశ్ రావు ఉన్నప్పుడు ఆయన పేషీలో వంశీకృష్ణ పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్, బెదిరింపులపై చక్రధర్ గౌడ్ గత సంవత్సరం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications