మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు: ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జీ జయకుమార్ సస్పెండ్, ఎందుకంటే?
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జీ కే జయకుమార్‌పై హైకోర్టు సస్పెండ్ చేసింది. అనుసరించాల్సిన విధానాలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చినందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉండగా ఆయనను పదవిలో కొనసాగిస్తే నిష్పాక్షిక విచారణకు విఘాతం కలుగుతుందనే సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సమయంలో హైకోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ వదిలి వెళ్లరాదని జయకుమార్‌ను ఆదేశించింది.

2018 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్‌పై.. స్థానిక ఓటరు సీహెచ్ రాఘవేంద్రరాజు ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ క్రమంలో నామినేషన్ సమయంలో జతపరిచిన అఫిడవిట్‌ను ఆ తర్వాత సవరించారని, శ్రీనివాస్ గౌడ్ తోపాటు అఫిడవిట్ ను సవరించడానికి అనుమతించిన ఎన్నికల అధికారులపై క్రిమనల్ కేసులో నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విచారించిన ప్రజాప్రతినిధుల జడ్జి జయకుమార్.. మంత్రితోపాటు ఎన్నికల సంఘం అధికారులు, రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు నివేదిక సమర్పించాలంటూ జులై 31న మహబూబ్‌నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు అమలు చేయలేదంటూ ఫిర్యాదుదారు ఆగస్టు 12న మరోసారి ప్రజాప్రతినిధుల కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో.. 'సాయంత్రం 4 గంటల్లోగా కేసు నమోదు చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది' అని జడ్జీ పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు మంత్రితోపాటు ఎన్నికల అధికారులపై కేసు నమోదు చేశారు.
అయితే, కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ తెలంగాణ హైకోర్టుకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై రిజిస్ట్రార్ జనరల్ విచారణ జరిపి నివేదికను హైకోర్టుకు సమర్పించారు. 'సీఆర్పీసీ సెక్షన్ 200 ప్రకారం రాఘవేంద్రరాజు ప్రైవేటు ఫిర్యాదు చేసినప్పుడు జడ్జి ఎలాంటి ప్రాథమిక విచారణ చేపట్టకుండా, ఫిర్యాదుదారు వాంగ్మూలం నమోదు చేయకుండా సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. జడ్జి విధి నిర్వహణలో, ఆయన ఇచ్చిన ఆదేశాల్లో లోపాలున్నాయి' అని రిజిస్ట్రార్ జనరల్ ఆ నివేదికలో స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి వినతిపత్రం, రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ఆధారంగా జడ్జి జయకుమార్ దుష్ప్రర్తనకు పాల్పడ్డారని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. అనంతరం జడ్జీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు హైదరాబాద్ వదిలి వెళ్లకూడదని ఆదేశించింది. అంతేగాక, తక్షణమే విధుల నుంచి తప్పుకుని.. బాధ్యతలను మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీకి అప్పగించాలని ఆదేశించింది. దీంతో తదుపరి ఆదేశాలు వెలువడేవరకూ మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జీగా కొనసాగనున్నారు.












Click it and Unblock the Notifications