గణేష్ నిమజ్జనం: హైదరాబాద్ తోపాటు ఈ జిల్లాల్లో 28న ప్రభుత్వ సెలవు
హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 28న అంటే గురువారం రోజున హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది. జంట నగరాలతోపాటు మేడ్చల్, మాల్కాజిగిరి జిల్లాలకు కూడా సెలవు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారంనాడు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.
కాగా, గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 21 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీతోపాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ ఫోర్స్‌తో నిఘా పెట్టారు.

నవరాత్రుల్లో భక్తులతో పూజలందుకున్న గణనాథుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్ తోపాటు చెరువులు, కృత్రిమ సరస్సుల్లో నిమజ్జనం చేస్తున్నారు. నవరాత్రుల్లో మూడో రోజు నుంచే గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ పోలీసు శాఖ భారీగా బందోబస్తు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. గణేష్ శోభయాత్రలు జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు చేపడుతున్నారు.
గణేష్ నిమజ్జనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిమజ్జనం కోసం దాదాపు 3600 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి నగరంలోని మూడు కమిషనరేట్లలో పెద్ద పండగ అని చెప్పారు. నగర వ్యాప్తంగా గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు.
వినాయక చవితి ఉత్సవాల కోసం నెల రోజుల ముందు నుంచే సిబ్బందిని సన్నద్ధం చేశామన్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని రోడ్ వర్క్స్, ఎలక్ట్రిల్ వర్క్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వినాయక విగ్రహాలు ప్రతిష్టించడానికి ముందు ఈసారి నిర్వాహకుల దగ్గర ఇంటిమేషన్ ఫామ్ తీసుకున్నామని, దీంతో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారన్నదానిపై స్పష్టత వచ్చిందని సీపీ తెలిపారు. గత సంవత్సరం 9 వేల విగ్రహాలు ప్రతిష్టంగా.. ఈసారి 11వేల విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని సీపీ చౌహాన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications