వణికిస్తున్న కూకట్‌పల్లి మర్డర్... మహిళ కాళ్లుచేతులు కట్టేసి.. కుక్కర్ మూతతో..
హైదరాబాద్ లోని కూకట్‌పల్లి షాకింగ్ ఘటన జరిగింది. ఒక మహిళను కొందరు గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. కాళ్లు చేతులు కట్టేసి కుక్కర్ మూతతో తలపై కొట్టి దారుణంగా మర్డర్ చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. కూకట్ పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్ మెంట్ లో ఈ దారణం జరిగింది. ఈ ఘటనతో నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. భయాందోళనకు లోనయ్యారు.
కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్ మెంట్ లోని 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ (50) అనే మహిళను కొందరు దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేణు అగర్వాల్ ను కాళ్లు, చేతులు కట్టేసి క్రూరంగా ప్రాణాలు తీశారని తేలింది. ప్రెజర్ కుక్కర్ మూతతో తలపై కొట్టి, పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు స్పష్టం అవుతోంది. అయితే 11 రోజుల క్రితం వీళ్ల ఇంట్లో పనిచేసేందుకు ఇద్దరు యువకులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే దుండగుల బట్టలు పూర్తిగా రక్తం మయం కావడంతో ఆ దుస్తులను అక్కడే వదలేసి ఇంట్లో స్నానం చేసి వేరే దుస్తులు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు దోచుకొని అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రేణు అగర్వాల్ (50) ఇంట్లో పనిచేసిన ఇద్దరు బీహార్ యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా లిఫ్ట్ లో ప్రయాణించిన దృశ్యాలు రికార్డు కావడం దర్యాప్తునకు మరింత బలం చేకూర్చింది. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని ఆరా తీశారు. వీలైనంత త్వరలో దుండగులను పట్టుకుంటామని తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేసినట్లు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications