ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎలా ఇస్తారు? రైతుల్లో కొత్త అనుమానం!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 12 వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. రైతు భరోసా కార్యక్రమంలో వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు 12వేలు
ఇక ఇదే సమయంలో భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు కూడా ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో తాను పాదయాత్ర చేసిన సమయంలో కౌలు రైతుల కష్టాలు తన దృష్టికి వచ్చాయని, అందుకే భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎలా ఇస్తారు?
భూమిలేని రైతులకు ఇచ్చే ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేసినట్టుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పైన రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో చర్చ జరుగుతుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఏ విధంగా ఇస్తారు? ఏ ప్రాతిపదికన కౌలు రైతులను గుర్తిస్తారు? అని చర్చిస్తున్నారు.
కౌలు రైతులకు 12వేలిస్తే.. ఆ భూములున్న రైతులకు వస్తుందా?
భూములు ఉన్న రైతులు కొందరు వ్యవసాయం చేయలేక కౌలుకిస్తే ఆ కౌలు చేసే రైతులకు ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రభుత్వం ఇచ్చినట్లయితే అసలు భూములున్న రైతులకు రైతుభరోసా రాదుకదా అని తర్జనభజన పడుతున్నారు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కౌలు చేసుకుంటున్న రైతులకు సంతోషాన్ని కలిగిస్తుండగా కౌలుకు తమ భూములను ఇచ్చిన రైతులకు మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
వారికి రైతు భరోసా రాదా?
సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తమకు రైతు భరోసా రాకుండా చేస్తుందా అన్న అనుమానాలు పలువురు రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ భూములు ఉన్న రైతులకు, భూమి లేకుండా వ్యవసాయం చేసే రైతులకు 12 వేల రూపాయలు ఇస్తే, ఈ పథకాలను మరికొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని కూడా చర్చలు జరుపుతున్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాధ్యమేనా?
కౌలు రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే ఆ రైతు ఏ పొలంలో వ్యవసాయం చేస్తున్నారు దాని తాలూకా కౌలు పత్రాన్ని తీసుకోవలసి వస్తుంది కావచ్చు అని, ఒకవేళ అది సదరు రైతు ఇస్తే ఆ రైతుకు రైతు భరోసా వచ్చే అవకాశం ఉండదని, అలాంటప్పుడు కౌలు రైతులకు భూమి ఉన్న రైతులు సహకరించే పరిస్థితి ఉంటుందా అని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆచరణ సాధ్యమైనదేనా అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.












Click it and Unblock the Notifications